మాకే పవర్ ఉంటే మీ ఫామ్​హౌసే కూల్చేటోళ్లం..

మాకే పవర్ ఉంటే మీ ఫామ్​హౌసే కూల్చేటోళ్లం..
  •     అప్పుడు పొగిడి, ఇప్పుడు బద్నాం చేస్తవా?
  •     నెల బోనస్‌ ఇచ్చినప్పుడు తెల్వదా.. అవినీతిపరులమని?
  •     భూరికార్డుల ప్రక్షాళన, రైతుబంధు మా కష్టమే
  •     అవి చెప్పకునే మీరు మళ్లీ సీఎం అయ్యిండ్రు
  •     ఆత్మ గౌరవ సభలో రెవెన్యూ ఉద్యోగుల ఆగ్రహం

హైదరాబాద్‌‌, వెలుగు‘భూ రికార్డుల ప్రక్షాళన చూసి మా అంత పనోళ్లు ఎక్కడా లేరని సీఎం కేసీఆర్‌‌ మెచ్చుకున్నరు. నెల జీతం బోనస్‌‌ ఇచ్చిండ్రు. ఇప్పుడేమో వీఆర్వోలంతా అవినీతిపరులని, వాళ్లు తలుసుకుంటే ఏదైనా చేయగలరని ప్రచారం చేస్తున్నరు. నిజంగా మాకు అంతటి అధికారమే ఉంటే.. ముందు సీఎం ఫామ్‌‌ హౌసే కూల్చెటోళ్లం. ఖబడ్దార్‌‌ కేసీఆర్‌‌.. మేం పూర్తి చేసిన భూరికార్డుల ప్రక్షాళనను, రైతుబంధును చెప్పుకొనే ఎన్నికల్లో గెలిచినవ్‌‌. మా వల్ల గెలిచిన నిన్ను మేమే గద్దె దింపుతం’ అని వీఆర్వోలు, వీఆర్‌‌ఏలు హెచ్చరించారు. 70 ఏళ్లుగా పెండింగ్‌‌లో ఉన్న రికార్డులను ఏడు నెలలు కష్టపడి ప్రక్షాళన చేశామని, 24  గంటలూ ఆఫీసుల్లోనే గడిపామని అన్నారు.  అప్పుడు పొగిడి, ఇప్పుడు బద్నాం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్వో, వీఆర్ఏ జాయింట్ యాక్షన్‌‌ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగుల ఆత్మగౌరవ సభ గురువారం జరిగింది. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి సుమారు 3 వేల మంది వీఆర్వోలు, వీఆర్‌‌ఏలు హాజరయ్యారు. ఇందులో తెలంగాణ వీఆర్వో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్‌‌ రావు మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతూ సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, స్వార్థ రాజకీయాల కోసం తమను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ను దగ్గర పెట్టుకుని రెవెన్యూ ఉద్యోగులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.  మాతో బానిసల్లా పనిచేయించుకుని చీడ పురుగుల్లా చూడడం భావ్యం కాదన్నారు. రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ప్రజల మద్దతుతోనే ప్రభుత్వంపై పోరాడుతామని, గద్దెనెక్కించిన మేమే దించుతామని హెచ్చరించారు. టీఎస్‌‌పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు షౌకత్‌‌ అలీ, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌.లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి హరాలే సుధాకర్‌‌రావు, డైరెక్ట్‌‌ వీఆర్వోల సంఘం నేతలు రవి నాయక్‌‌, చెన్నం రాజు, రిటైర్డ్‌‌ వీఆర్వోల సంఘం అధ్యక్షుడు పెండ్యాల విజయరామారావు, వీఆర్‌‌ఏల సంఘాల నేతలు  పాల్గొన్నారు.

టైటిల్‌‌ గ్యారెంటీ యాక్ట్‌‌ తీసుకురావాలె

భూమి హద్దులకు, హక్కులకు రక్షణ కల్పిం చే వ్యవస్థ కావాలని రైతులు కోరుతున్నరు. ఊరికో వీఆర్వో ఉండాలి.  టైటిల్ గ్యారెంటీ చట్టం తీసుకొస్తే ప్రభుత్వమే భూమి హక్కుల కు బాధ్యత వహిస్తుంది.రాజస్థాన్, కర్ణాటకలో ఈ చట్టం ఉంది. ఏపీ అసెంబ్లీలోనూ బిల్లు పాసైంది. మన రాష్ట్రంలోనూ రావాలి.

– సునీల్ కుమార్, ల్యాండ్‌‌ లా నిపుణులు

పోలీస్‌‌ శాఖను రద్దు చేస్తరా?

అవినీతి జరుగుతోందంటూ రెవెన్యూను రద్దు చేయాలంటున్నరు. మరి పోలీస్‌‌ శాఖపైనా ఆరోపణలున్నయి.  ఆ శాఖనూ రద్దు చేస్తరా? ఇంటికి చెదలు పట్టిందని కూల్చేస్తమా? అవినీతి ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా శాఖనే రద్దు చేస్తామనడం సరికాదు. ఎక్కడ రాజకీయ నాయకుల్లో అవినీతి ఉంటుందో అక్కడే ఉద్యోగులు కూడా అవినీతిపరులవుతారు. రెవెన్యూ ఉద్యోగులను పంచాయతీ శాఖలో విలీనం చేస్తే అవినీతి పోతుందని గ్యారంటీ ఇస్తరా? వీఆర్వోలు కూడా రైతుల్ని కలుపుకుని పోరాడితేనే సక్సెస్‌‌ అవుతరు.

– ప్రొఫెసర్‌‌ కె.నాగేశ్వర్‌‌, మాజీ ఎమ్మెల్సీ

గత ఐదేళ్లలో అవినీతి కనిపించలేదా?

నిజంగా అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే స్వాగతిస్తం. అవినీతిపై యుద్ధం సీఎం ఆఫీస్‌‌ నుంచే మొదలుపెట్టాలి. మంత్రుల్లో చాలా మంది అవినీతికి పాల్పడుతున్నరు. ఐదేళ్ల కాలంలో మియాపూర్‌‌, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భూకుంభకోణాలు బయటకొచ్చినా ప్రభుత్వం కొట్టి పారేసింది. గత ఐదేళ్లలో ఏనాడూ అవినీతి కన్పించలేదా?  వీఆర్వోలు, వీఆర్‌‌ఏలు అవినీతిపరులైతే ఇన్నాళ్లు కలెక్టర్లు ఏం  చేశారు?

– ఎస్ .వీరయ్య, సీనియర్‌‌ జర్నలిస్ట్‌‌