రష్యాలో తిరుగుబాటు.. గంటల్లోనే వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్​

రష్యాలో తిరుగుబాటు.. గంటల్లోనే వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్​
  • రొస్తోవ్, వెరోనెజ్‌‌ సిటీలు స్వాధీనం.. మాస్కోవైపు కదిలిన బలగాలు
  • కొన్ని గంటల తర్వాత అనూహ్యంగా వెనక్కి తగ్గిన వాగ్నర్ చీఫ్​

మాస్కో/కీవ్:  తన ఊరి నుంచే వచ్చాడు.. తన నీడలో ఎదిగాడు.. కుడి భుజంలా ఉన్నాడు.. యుద్ధంలోనూ మద్దతుగా నిలిచాడు. కానీ అనూహ్యంగా తిరుగుబాటుకు దిగాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పెంచి పోషించిన యవ్జెనీ ప్రిగోజిన్ ఆయనపైనే యుద్ధానికి దిగారు. రష్యా నాయకత్వాన్ని కూలదోసి, కొత్త అధ్యక్షుడిని నియమిస్తామంటూ ప్రకటన చేశారు. చావడానికైనా సిద్ధమని, లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు నగరాలను స్వాధీనం చేసుకుని, మాస్కో వైపుగా తన బలగాన్ని నడిపించారు. అయితే, అనూహ్యంగా రాత్రి వెనక్కి తగ్గారు. కవాతును నిలిపేయాలని, ఉక్రెయిన్‌లోని క్యాంపులకు తిరిగి వెళ్లిపోవాలని తన సైన్యాన్ని ఆదేశించారు. అనవరంగా రష్యన్ల రక్తం చిందించడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించారు. అంతకుముందు ప్రిగోజన్‌ తిరుగుబాటుపై తీవ్రంగా స్పందించిన పుతిన్.. దేశానికి ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. తన దేశాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తానని హెచ్చరించారు. అయితే, బెలరాస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మధ్యవర్తిత్వం తర్వాత ప్రిగోజిన్ మెత్తబడ్డారు. తన తిరుగుబాటు ప్రయత్నాన్ని మధ్యలోనే నిలిపేశారు. దీనిపై శనివారం అర్ధరాత్రి వరకు క్రెమ్లిన్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

తిరుగుబాటు అందుకేనా?

ఉక్రెయిన్‌‌లోని వాగ్నర్ ఫీల్డ్ క్యాంపులపై రాకెట్లు, హెలికాప్టర్ గన్‌‌షిప్‌‌లు, ఆర్టిలరీతో రష్యా ప్రభుత్వ బలగాలు దాడి చేశాయని యవ్జెనీ ప్రిగోజిన్ ఆరోపించారు. రక్షణ మంత్రి షోయిగుతో చీఫ్‌‌ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్  సమావేశం తర్వాత.. వాగ్నర్‌‌‌‌ క్యాంపులపై దాడులకు ఆదేశించారని చెప్పారు. రక్షణ మంత్రి సెర్గీ షోయిగును శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి వల్ల తమ సహచరులు భారీ సంఖ్యలో హత్యకు గురయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రష్యా మిలిటరీ నాయకత్వాన్ని పడగొట్టేందుకు తిరుగుబాటు చేశారు. ఉక్రెయిన్‌‌ నుంచి రష్యాలోని రొస్తోవ్‌‌లోకి తన బలగాలను తీసుకొచ్చారు. 

మిత్ర దేశాలతో మాట్లాడిన ప్రెసిడెంట్​ పుతిన్

తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్ తన మిత్ర దేశాల అధినేతలతో మాట్లాడారు. బెలారస్ ప్రెసిడెంట్​కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. కజకిస్తాన్, తుర్కియే, ఉజ్బెకిస్తాన్ నేతలతోనూ మాట్లాడారు.

ఎవరీ ప్రిగోజిన్?

ప్రైవేట్ సైన్యం ‘వాగ్నర్’ గ్రూపు అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు దొంగ, వంటవాడైన ప్రిగోజిన్.. గతంలో పుతిన్ తో ఏర్పడిన పరిచయంతో ఇప్పుడీ స్థాయికి చేరుకున్నాడు. ప్రిగోజిన్ 1961 జూన్ 1న పుట్టాడు. 18 ఏండ్ల వయసులో దొంగతనం కేసులో రెండేండ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మళ్లీ దొంగతనం, హత్య కేసులో అరెస్టు అయ్యాడు. అప్పుడు 12 ఏండ్ల జైలు శిక్ష పడింది. క్షమాభిక్ష లభించడంతో 1990లో జైలు నుంచి విడుదలయ్యాడు. బయటకొచ్చాక సెయింట్ పీటర్స్ బర్గ్ లో రెస్టారెంట్ పెట్టాడు. అక్కడికి పుతిన్ తరచూ వెళ్తుండేవారు. అలా పుతిన్ తో ప్రిగోజిన్ కు మంచి పరిచయం ఏర్పడింది. పుతిన్ సహకారంతో రెస్టారెంట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. ప్రభుత్వ ఫుడ్ కాంట్రాక్టులు సంపాదించాడు. పుతిన్ అధ్యక్షుడు అయ్యాక.. ఆయన వ్యక్తిగత వంట మనిషిగా మారిపోయాడు.  

వాగ్నర్ గ్రూప్ ఏర్పాటు.. 

పుతిన్ కు అత్యంత సన్నిహితుడిగా మారిన ప్రిగోజిన్.. ఆ తర్వాత ఆయన యుద్ధ, రాజకీయ వ్యూహాల్లోనూ భాగస్వామి అయ్యాడు. దేశవిదేశాల్లో కీలకమైన సీక్రెట్ ఆపరేషన్లను ప్రిగోజిన్ ద్వారానే పుతిన్ చేయిస్తూ ఉండేవారని చెబుతుంటారు. ఇందుకోసం ప్రిగోజిన్ ఆధ్వర్యంలో ఏర్పడిందే వాగ్నర్ గ్రూప్. ఇదొక ప్రైవేట్ ఆర్మీ. రష్యా సైన్యానికి జీతాలు చెల్లించినట్టే, ఈ గ్రూపులోని సైనికులకు జీతాలు ఇస్తుంటారు. దీంతో పెద్ద సంఖ్యలో యువత చేరారు. మొదట్లో 5వేల మందిని రిక్రూట్ చేసుకోగా,  ఆ తర్వాత ఈ సంఖ్య 15 వేలకు చేరింది. ఇప్పుడు ఇందులో దాదాపు 50 వేల మంది ఉంటారని సమాచారం.

రెండు నగరాలపై పట్టు

‘వాగ్నర్‌‌’ గ్రూప్‌‌ చీఫ్ ప్రిగోజిన్.. రష్యా సైనిక నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో రొస్తోవ్‌‌లోని మిలిటరీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. నగరాన్ని నియంత్రణలో తీసుకున్నామని, మాస్కో వైపు వస్తామని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ మేరకు కొన్ని ఆడియోలు కూడా సోషల్ మీడియా వేదికల్లో కనిపించాయి. రష్యా మంత్రి సెర్గీ షోయిగు, జనరల్ వాలరీ గెరాసిమోవ్ తనను కలవడానికి రాకపోతే మాస్కోను ముట్టడిస్తామని ప్రిగోజిన్ హెచ్చరించారు. వెరోనెజ్‌‌లోని మిలిటరీ స్థావరాలను వాగ్నర్ గ్రూపు స్వాధీనం చేసుకుంది. రొస్తోవ్‌‌లో ట్యాంకులు సహా మిలిటరీ వెహికల్స్ వీధుల్లో వెళ్లడం కొన్ని వీడియోల్లో కనిపించింది. మరోవైపు లిపెట్స్‌‌స్క్‌‌ ప్రావిన్స్‌‌ వైపు వాగ్నర్‌‌‌‌ ట్రూప్స్ కదిలాయి. ఈ పరిణామంతో మాస్కోలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ‘కౌంటర్ టెర్రరిజం రెజిమ్‌‌’ను ప్రకటించారు. ఉగ్రదాడులను నిరోధించే లక్ష్యంతో మాస్కో లోని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసినట్లు నేషనల్ యాంటీ టెర్రరిజం కమిటీ తెలిపింది.

రష్యాను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తా: పుతిన్

వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు నేపథ్యంలో రష్యా ప్రజలను ఉద్దేశించి పుతిన్ మాట్లాడారు. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన వారు విద్రోహులని మండిపడ్డారు. దేశానికి వెన్నుపోటు పొడిచారని, వాళ్లు భవిష్యత్​లో తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సొంత లాభం కోసం వాగ్నర్ గ్రూప్ దేశానికి ద్రోహం చేస్తోందని పుతిన్ మండిపడ్డారు. రష్యాను, ప్రజలను కాపాడుకునేందుకు తాను ఎంతటి నిర్ణయాలైనా తీసుకుంటానని స్పష్టం చేశారు. తిరుగుబాటుదారులను  అంతం చేయాలని సాయుధ దళాలకు ఆదేశాలిచ్చారు. కాగా, తిరుగుబాటు నేపథ్యంలో పుతిన్ మాస్కో డిఫెన్స్ ఎయిర్‌‌పోర్ట్ నుంచి ప్రెసిడెన్షియల్​ జెట్​లో వెళ్లిపోయారన్న కథనాలను కొట్టిపారేసింది.

మాతృభూమి కోసం మా అడుగులు ముందుకే: ప్రిగోజిన్

తాము ఒక్క బుల్లెట్ కూడా కాల్చకుండానే రోస్టోవ్- ఆన్-డాన్‌‌లోని రష్యా సైనిక ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నామని వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ చెప్పారు. పుతిన్ మాట్లాడిన తర్వాత ప్రిగోజిన్ మాట్లాడారు. తిరుగుబాటు చేసిన వాగ్నర్ యోధులను పుతిన్ ద్రోహులని పిలవడం తప్పన్నారు. ‘‘మేం ఎవరికీ ద్రోహం చేయలేదు. అధ్యక్షుడు పొరబడ్డారు. మేం దేశభక్తులం. ఏ ఒక్కరూ లొంగిపోవట్లే. ఎందుకంటే మేం ఈ దేశాన్ని అవినీతి, బ్యూరోక్రసీలో మగ్గిపోవాలని కోరుకోవడం లేదు. రష్యాకు కొత్త అధ్యక్షుడు వస్తారు’’ అని చెప్పారు. రష్యా మిలిటరీ నాయకత్వాన్ని పడగొట్టేందుకు తన 25 వేల మంది సైన్యం చావడానికి సిద్ధం ఉన్నారని ప్రకటించారు. తమ అడుగులు ముందుకేనని, తాము ముగింపు దాకా వెళ్తామని స్పష్టంచేశారు. ఇది న్యాయం కోసం జరుగుతున్న కవాతు అని ప్రిగోజిన్ చెప్పారు.