విభిన్న పాత్రలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతోంది కీర్తి సురేశ్. ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా నటించిన చిత్రం'రివాల్వర్ రీటా'. ఇది కేవలం కామెడీ, యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, ఓ సామాన్య యువతి అనూహ్యంగా గ్యాంగ్‌స్టర్ల ప్రపంచంలోకి అడుగుపెట్టి, వారిని ముప్పుతిప్పలు పెట్టే సాహస గాథ. జే.కే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్..
కథాంశం..
కీర్తి సురేశ్ ఈ సినిమాలో 'రీటా' అనే మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. తన కుటుంబం ఊహించని పరిస్థితుల్లో ఒక హింసాత్మకమైన గ్యాంగ్ వార్‌లో చిక్కుకోవడంతో, తన వారిని కాపాడుకునేందుకు రీటా తుపాకీ (రివాల్వర్) పట్టుకోవాల్సి వస్తుంది. తన పదునైన తెలివితేటలు, అసాధారణమైన ధైర్యంతో ఆమె గ్యాంగ్‌స్టర్లను ఎలా ఓడించింది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. లేటెస్ట్ గా విడుదలైన పల్ప్-ఫిక్షన్ స్టైల్‌లోని ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది.
ఈ సినిమాలో కీర్తి సురేశ్‌తో పాటు సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన సునీల్, అజయ్ ఘోష్ తో పాటు సూపర్ సుబ్బరాయన్, జాన్ విజయ్, రెడిన్ కింగ్స్ లు వంటి ప్రముఖ నటీనటులు నటించారు. ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్‌పై సుదన్ సుందరం, జగదీష్ పళనిస్వామి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వినసొంపైన సంగీతాన్ని సీన్ రోల్డాన్ అందించగా, దినేష్ బి. కృష్ణన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ సినిమాకు సాంకేతిక బలాన్ని చేకూర్చాయి.
ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ఖరారు కావడంతో.. నవంబర్ 28న థియేటర్లలో 'రీటా' చేసే రచ్చను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహిళా ప్రధాన చిత్రాలకు ప్రాధాన్యత పెరిగిన ఈ తరుణంలో, కామెడీ, యాక్షన్ అంశాలతో కూడిన ఈ చిత్రం కీర్తి సురేశ్‌కు మరో ఘన విజయాన్ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది.
