కేసీఆర్​ ఇక ఫామ్​హౌస్​కే పరిమితం

 కేసీఆర్​ ఇక ఫామ్​హౌస్​కే పరిమితం

 

  • సీఎం​వన్నీ కథలే..సీరియస్​గా తీసుకోవాల్సిన పని లేదు
  • ఆయన మాటలు చిత్తు కాగితాలతో సమానం


హైదరాబాద్​, వెలుగు: టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​ చేసి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని కేసీఆర్​ అంటున్నట్లు వస్తున్న వార్తల్ని సీరియస్​గా తీసుకోవాల్సిన అవసరం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి అన్నారు. టీఆర్​ఎస్​కు జనం వీఆర్​ఎస్​ ఇచ్చే రోజులు వచ్చాయని,  జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ను పెద్ద జోకర్​గా చూస్తున్నారని పేర్కొన్నారు. గాంధీభవన్​లో శనివారం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్​వన్నీ కథలే. టీఆర్​ఎస్​ పేరు మీదనైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది.. బీఆర్​ఎస్​ పేరు మీద ఎక్కడ పోటీ చేస్తరు? ఏపీలోని నెల్లూరులో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది..  అక్కడ కేసీఆర్  పోటీకి దిగుతరా?” అని ప్రశ్నించారు.  కేసీఆర్​ మాటలు చిత్తుకాగితాలతో సమానమన్నారు.  ‘‘బీఆర్​ఎస్​ని ముందుకు తెస్తున్నారంటే, టీఆర్​ఎస్​కు కాలం చెల్లిందని అనుకోవాలా? కేసీఆర్​ మెడిసిన్​కు కాలం చెల్లిపోయింది. అది ఇంకా తెలంగాణలో పని చేయదు” అని పేర్కొన్నారు. 

రేపు ఈడీ ఆఫీస్​ ముందు నిరసన 

రాహుల్​ గాంధీ సోమవారం ఢిల్లీలో ఈడీ ముందు హాజరవుతున్నందున గాంధీభవన్​లో శనివారం ఉదయం ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల్లో ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ అంశంపై రేవంత్​ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సమీక్ష జరిపారు. ఉదయం 10 గంటలకు  నెక్లెస్​ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్​బాగ్​లోని ఈడీ ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి రాహుల్​ విచారణ ముగిసే వరకు అక్కడే నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు రేవంత్​ తెలిపారు.

కేసీఆర్​, అసద్​ ఎందుకు స్పందించరు?

రాష్ట్రంలో 15 రోజుల్లో ఎనిమిది రేప్​లు జరిగాయని, మైనర్లపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని రేవంత్​ ఆవేదన వ్యక్తం చేశారు.  నేరస్తులను శిక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని, పైగా సర్కారే నేరాలకు పాల్పడుతున్నదని రేవంత్​ మండిపడ్డారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నా సీఎం కేసీఆర్​ స్పందించకపోవడం దారుణమని అన్నారు. అసదుద్దీన్​ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. దీన్ని బట్టి టీఆర్​ఎస్​, ఎంఐఎంలు పొత్తులు పొట్టుకొనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయని 
రేవంత్​ రెడ్డి ఆరోపించారు.

బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలె

విద్యార్థుల మంత్లీ బస్ పాస్ చార్జీలను రూ.195 నుంచి రూ.450కి పెంచడంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని మండిపడ్డారు. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం పేద, మధ్య తరగతి వర్గాలకు భారంగా మారుతుందని అన్నారు. ఊహించని స్థాయిలో పెరిగిన ఛార్జీలు.. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ  నిర్ణయాన్ని ఆర్టీసీ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.