‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ : వర్మ కొత్త సినిమా

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ : వర్మ కొత్త సినిమా

ఈనెల 31వతేదీన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్ ’ సినిమా విడుదలవుతుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 25ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీశామన్నారు.  నిజాలను బయటకు తీసుకురావడం కోసమే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నిర్మించామన్నారు.  ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లోనూ ఒకేసారి విడుదల చేద్దామనుకున్నామని  కాని ఏపీలో అడ్డుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల కోడ్  అమలులో ఉన్నా రిలీజ్ చేశామని,  కానీ ఏపీలో మాత్రం విడుదల కానివ్వలేదన్నారు.

ఆ వ్యక్తి ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది

విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టకుండా అన్యాయంగా అడ్డుకున్నారన్నారు వర్మ. ఒక కీలక వ్యక్తి ఫోన్ చేయడం వల్ల తనను బలవంతంగా వెనక్కి పంపారని, ఆ వ్యక్తి ఎవరు అనేది త్వరలోనే బయటకు వస్తుందని ఆర్జీవి అన్నారు. ఏ వ్యక్తి ఫొటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో అదే వ్యక్తి ని ఎలా వెన్నుపోటు పొడిచారో సినిమాలో చూపించామన్నారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు ఏం చేశారో చెప్పాలనుకున్నామన్నారు. చంద్రబాబు కాంట్రవర్సీ చేశారే తప్ప సినిమాలో అలాంటివేమీ లేదన్నారు.

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత తాను తీయబోయే మరో సినిమాను ఈ ప్రెస్ మీట్ లో ప్రకటించారు వర్మ.  ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే పేరుతో ఓ కొత్త సినిమా తీయబోతున్నానని, విజయవాడ వచ్చాకే ఈ సినిమా ఆలోచన వచ్చిందన్నారు. కాంట్రవర్సీ అంశాలపై సినిమాలు తీయడమంటే తనకు ఇష్టమని, అలాగే ముందుకెళతానని అన్నారు ఆర్జీవి.

బాబు ఓటమికి అదే కారణం

చంద్రబాబు పరాజయానికి ఆయన చెప్పిన పనులు చేయకపోవడం కారణమని రామ్ గోపాల్ వర్మ అన్నారు.  ఓదార్పు యాత్రతో జగన్ ప్రజాభిమానం పొందారని, అతన్ని నమ్మె ప్రజలు టీడీపీకి కాకుండా వైసీపీకి ఓటేశారన్నారు. చంద్రబాబు, టీడీపీ ఓటమికి ఆయన కుమారుడు  లోకేష్ కూడా మరో కారణమని  భావిస్తున్నానని వర్మ అన్నారు.

చిరంజీవి పార్టీ బాహుబలి

తాను లక్ష్మీస్ యన్టీఆర్‌ సినిమా బిజీలో ఉండి పవన్ కళ్యాణ్ విషయాలను నేను పట్టించుకోలేదని ఆర్జీవి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవి కి 18సీట్లు వచ్చాయని అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కు ఒకే ఒక్క సీటు వచ్చిందని విన్నానన్నారు. తన దృష్టిలో పవన్ జనసేన తో పోలిస్తే చిరంజీవి ప్రజారాజ్యం బాహుబలి అని రామ్ గోపాల్ వర్మ అన్నారు.