RGV: రాజమౌళికి అండగా ఆర్జీవీ.. "నాస్తికత్వం నేరం కాదు, ఇది భక్తుల అసూయే!"

RGV: రాజమౌళికి అండగా ఆర్జీవీ.. "నాస్తికత్వం నేరం కాదు, ఇది భక్తుల అసూయే!"

సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం' వారణాసి'. అయితే  ఈ సినిమా టైటిల్ ప్రారంభోత్సవ వేదికపై రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈవెంట్ లో సాంకేతిక లోపం తల్లెత్తినప్పుడు  అసహనానికి గురయ్యారు. నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్న చెప్పినట్లు హనుమంతుడు నడిపిస్తే ఇదేనా నడిపించడం?అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ హిందూ సంఘాలను, పలువురు రాజకీయ నాయకులను ఆగ్రహానికి గురిచేశాయి. విశ్వహిందూ పరిషత్ సహా అనేక సంస్థలు రాజమౌళి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. లేదంటే ఆయన సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించాయి.

నాస్తికత్వం నేరం కాదు..

ఈ నేపథ్యంలో, సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ (ఆర్జీవీ) తనదైన శైలిలో ట్విట్టర్ వేదికగా రాజమౌళికి మద్దతుగా నిలుస్తూ, విమర్శకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజమౌళిపై విషం చిమ్ముతున్న సోకాల్డ్ 'విశ్వాసులు' తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... భారతదేశంలో నాస్తికుడిగా (Atheist) ఉండటం నేరం కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 మత స్వేచ్ఛను రక్షించినట్టే, ఎవరినీ విశ్వసించకపోవడాన్ని కూడా రక్షిస్తుంది. అందుకే, తాము దేవుడిని నమ్ముతున్నామని చెప్పే హక్కు వారికి ఎంత ఉందో, రాజమౌళికి కూడా తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పే హక్కు అంతే ఉంది.

ALSO READ : వద్దనుకున్న బంగారమే పేరు తెచ్చిపెట్టింది..

 గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే గ్యాంగ్‌స్టర్‌గా మారాలా?

ఇక దేవుడిని నమ్మని రాజమౌళి... దేవుడి పాత్రలను, కథలను ఎందుకు తన సినిమాల్లో చూపిస్తున్నాడు? అనేది మూర్ఖపు వాదన అంటూ ఆర్జీవీ ట్విట్ చేశారు. ఆ లెక్కన, ఒక సినిమా దర్శకుడు గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలంటే ముందుగా గ్యాంగ్‌స్టర్‌గా మారాలా? లేక హారర్ సినిమా కోసం దెయ్యంగా మారాలా?" అని ఆర్జీవీ ప్రశ్నించారు. సినిమా అనేది కేవలం కథాంశం మాత్రమేనని, వ్యక్తిగత నమ్మకాలతో దానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

 దేవుడికి నాస్తికులే ఇష్టమా?

రాజమౌళికి వ్యతిరేకంగా మాట్లాడేవారు జీర్ణించుకోలేని 'నిజం' ఏమిటో ఆర్జీవీ సంచలనంగా వెల్లడించారు. రాజమౌళి దేవుడిని నమ్మకపోయినా, చాలా మంది విశ్వాసులు వంద జన్మల్లో కూడా చూడనంత విజయాన్ని, సంపదను, అభిమానుల ఆరాధనను దేవుడు ఆయనకి ఇచ్చాడు  అని వర్మ పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే... దేవుడు నాస్తికులనే ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో? లేదా దేవుడికి ఈ విషయాలు అసలు పట్టవేమో , లేదా... ఎవరు నమ్ముతున్నారని నోట్‌ప్యాడ్ పట్టుకుని దేవుడు కూర్చోలేదేమో? అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

 అసలు సమస్య భక్తుల అసూయే!

రాజమౌళితో దేవుడికే సమస్య లేనప్పుడు, ఈ స్వయం ప్రకటిత 'ధర్మ రక్షకులు' ఎందుకు బీపీ, అల్సర్‌ తెచ్చుకుంటున్నారు? అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఆయన దృష్టిలో, రాజమౌళి నాస్తికత్వమే అసలు సమస్య కాదు. "దేవుడిని నమ్మకుండానే రాజమౌళి గొప్ప విజయం సాధించడమే అసలు సమస్య. ఎందుకంటే, దేవుడిని పిచ్చిగా ప్రార్థించినా విజయం సాధించలేని వారిని ఇది భయపెడుతోంది.

 దేవుడి శక్తి ఏమీ తగ్గదు. 

రాజమౌళి నాస్తికుడైనంత మాత్రాన దేవుడి శక్తి ఏమీ తగ్గదు. నమ్మకం ఆగిపోయిన వెంటనే విశ్వాసం కూలిపోతుందని భావించే వారి 'అభద్రతాభావం' (Insecurity) మాత్రమే పెరుగుతుంది. "విశ్వాసులు దేవుడిని రక్షించడం మానేయండి. అది దేవుడిని అవమానించినట్లే, ఆయనను బలహీనుడిలా చూసినట్లేఅని వర్మ హితవు పలికారు.

 "దేవుడు బాగానే ఉన్నాడు. రాజమౌళి బాగానే ఉన్నాడు. వీరిద్దరినీ అర్థం చేసుకోలేని వారే బాధపడుతున్నారు. ఆయన తదుపరి చిత్రం #వారణాసి ద్వారా దేవుడు రాజమౌళి బ్యాంకు బ్యాలెన్స్‌ను మరింత పెంచుతాడు. దేవుడి నమ్మకం పేరుతో అసూయ పడుతున్నవాళ్లు ఏడుస్తూ కూర్చోవడమే. అసలు విషయం ఏంటంటే... ఇది కేవలం అసూయ! దేవుడిపై నమ్మకం ముసుగులో నడుస్తున్న అసూయ!" అని 'జై హనుమాన్' అంటూ ఆర్జీవీ తన ట్వీట్‌ను ముగించారు. రాజమౌళి వ్యాఖ్యలు, ఆపై ఆర్జీవీ కౌంటర్... ఈ రెండు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.