రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ!

రైతులకు వ్యాపారి కుచ్చుటోపీ!
  • రూ.7 కోట్లకు ఐపీ పెడుతున్నట్లు ప్రచారం 
  • వ్యాపారి ఇంటి ముందు రైతుల ఆందోళన 

లక్సెట్టిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారి రైతుల నుంచి వడ్లు తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళనకు దిగారు. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన సదరు వ్యాపారి ఐపీ పెడుతున్నాడంటూ మంగళవారం సోషల్  మీడియాలో  జోరుగా ప్రచారం జరిగింది. 195  మంది రైతులకు రూ.7 కోట్ల వరకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా, మరికొంత వ్యాపారుల వద్ద కూడా అప్పులు చేసి ఐపీ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వైరల్  అయింది.

 దీంతో ఆగ్రహించిన దండేపల్లి మండలానికి చెందిన 100 మంది రైతులు వ్యాపారి ఇంటికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాపారికి అప్పులు ఇచ్చిన వారు కూడా లబోదిబోమంటున్నారు. ఎస్సై గోపతి సురేశ్​ అక్కడికి చేరుకుని రైతులకు సర్ది చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఇదిలాఉంటే ఆ వ్యాపారస్తునికి చెందిన ఇల్లు.. వడ్లు అమ్ముకొని నష్టపోయిన రైతులకు చెందాలని కోరుతూ ఇంటిపై ‘ఈ ప్రాపర్టీ దండేపల్లి రైతులది’ అని రాశారు.