అప్పటికప్పుడు ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసుకోవాలంటే... బియ్యప్పిండి కేరాఫ్ అవుతుంది. దీంతో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకమైన వంటకం తయారు చేస్తారు. ఎప్పుడూ తెలిసిన వంటలే కాకుండా... మన వంటలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల వంటలూ ట్రైచేయాలి. ఈసారి బియ్యప్పిండితో చేసే ఈ వంటలు తిని చూడండి.. టేస్ట్ అదిరిపోద్ది..!
సర్వపిండి తయారీకి కావాల్సినవి
- బియ్యప్పిండి - ఒక కప్పు
- కరివేపాకు-రెండు రెమ్మలు
- నువ్వులు- ఒక టేబుల్ స్పూన్
- కారం-ఒక టీ స్పూన్
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్
- ఉల్లిగడ్డ తరుగు- పావు కప్పు
- శెనగపప్పు- పావు కప్పు
- నూనె - సరిపడా
- ఉప్పు- తగినంత
- పచ్చిమిర్చి పేస్ట్- ఒక టీస్పూన్
- కొత్తిమీర తరుగు - పావు కప్పు
తయారీ విధానం: శెనగపప్పుని అరగంట సేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, నువ్వులు, ఉల్లిగడ్డ తరుగు, నానబెట్టిన శెనగపప్పు, కొత్తిమీర తరుగు వేయాలి. అందులో సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. తర్వాత ఒక గిన్నె లేదా పాన్ కు నూనె రాసి, పిండి ముద్దని దానిపై పల్చగా వత్తాలి. మధ్యమధ్యలో రంధ్రాలు పెట్టి నూనె పోయాలి. దానిపై మూతపెట్టి చిన్న మంటపై ఉడికించాలి. కావాలంటే రెండోవైపుని కూడా కాల్చుకోవచ్చు. ఇది తెలంగాణ స్పెషల్ వంటకం. రుచి అదిరిపోద్ది
పటోలీ తయారీకి కావాల్సినవి
- బియ్యప్పిండి- రెండు కప్పులు
- ఉప్పు - చిటికెడు
- ఎండు లేదా పచ్చికొబ్బరి తురుము - ఒకటిన్నర కప్పు
- బెల్లం తురుము - ఒక కప్పు
- ఇలాచీ పొడి- ఒకటి స్పూన్
- పసుపు ఆకులు - ఆరు
తయారీ విధానం : ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. మరో గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఇలాచీ పొడి వేసి కలపాలి. తర్వాత పసుపు ఆకు మీద బియ్యప్పిండి మిశ్రమం పరచాలి. దాని మీద బెల్లం మిశ్రమం వేసి, ఆకును మడవాలి. అలా పిండి మొత్తాన్నీ చేశాక, వాటిని ప్రెజర్ కుక్కర్లో ఆవిరిపై ఉడికించాలి. ఈ స్పెషల్ వంటకాన్ని కేరళలో ఎక్కువగా చేస్తారు.
నిప్పట్టు తయారీకి కావాల్సినవి
- బియ్యప్పిండి- ఒక కప్పు
- పల్లీలు- మూడు టేబుల్ స్పూన్లు
- పుట్నాలు- మూడు టేబుల్ స్పూన్లు
- ఎండుకొబ్బరి తురుము-ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)
- నువ్వులు- ఒక టేబుల్ స్పూన్
- కారం- ముప్పావు టీ స్పూన్
- ఉప్పు- తగినంత
- కరివేపాకు- రెండు రెమ్మలు
- ఉప్మా రవ్వ - ఒక టేబుల్ స్పూన్ (కావాలంటే)
- నూనె - సరిపడా
తయారీ విధానం : పల్లీలు, పుట్నాలు, ఎండుకొబ్బరి తురుమును విడివిడిగా వేగించాలి. వాటన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో బియ్యప్పిండి, పల్లీల మిశ్రమం, నువ్వలు, కారం, ఉప్పు, కరివేపాకు, వేగించిన ఉప్మా రవ్వ, కొద్దిగా వేడి నూనె, సరిపడా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. పావుగంట తర్వాత పిండిని కొద్దికొద్దిగా తీసుకొని ఉండలు చేయాలి. వాటిని చిన్న సైజు పూరీల్లా వత్తి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఈ స్నాక్ కర్ణాటకలో బాగా ఫేమస్. మరి మీరు కూడా ట్రై చేయండి..
