కాంగ్రెస్‌ చీఫ్‌‌గా సోనియానే కొనసాగాలి: పంజాబ్ సీఎం

కాంగ్రెస్‌ చీఫ్‌‌గా సోనియానే కొనసాగాలి: పంజాబ్ సీఎం

చండీగఢ్‌: కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వాన్ని మార్చాలని కోరుతూ పలువురు సీనియర్ ఎంపీలు సోనియాకు లేఖను అందజేశారు. ఈ లెటర్‌‌పై అధినేత్రి స్పందిస్తూ కొత్త చీఫ్‌ను మీరే కనుగొనాలని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, కర్నాటక మాజీ సీఎం సిద్దరామయ్య కామెంట్ చేశారు. ఈ కఠిన పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలను సోనియానే మోయాలని సూచించారు. కాంగ్రెస్ కోసం నిస్వార్థంగా సేవలు అందించిన, త్యాగాలు చేసిన గాంధీ కుటుంబ నాయకత్వాన్ని ప్రశ్నించడం తప్పన్నారు.

‘ప్రస్తుతం పార్టీ ఉన్న కఠిన పరిస్థితుల్లో లీడర్లు నాయకత్వ మార్పును కోరుతూ డిమాండ్ చేయడం కాంగ్రెస్ ఆసక్తులతోపాటు దేశ ఆసక్తులకు వ్యతిరేకమనే చెప్పాలి. రాజ్యాంగం ముప్పును ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఇండియాకు శక్తిమంతమైన, సమష్టి ప్రతిపక్షం అవసరం ఉంది. మొత్తం పార్టీకి ఆమోదమైన నాయకత్వం కాంగ్రెస్‌కు కావాలి. సోనియా తాను కాంగ్రెస్‌కు ప్రెసిడెంట్‌గా కొనసాగాలని భావించినంత కాలం కంటిన్యూ అవ్వాలి’ అని అమరిందర్ సింగ్ పేర్కొన్నారు.

‘గాంధీ కుటుంబ నాయకత్వాన్ని కొందరు ప్రశ్నించడం దురదృష్టకరం. ప్రజాస్వామ్యంపై బీజేపీ అటాక్ చేస్తున్న ఈ కఠిన పరిస్థితుల్లో మనం సమష్టిగా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి గానీ బలహీనం కాదు’ అని సిద్దరామయ్య ట్వీట్ చేశారు.