కొత్త మాస్టర్​ ప్లాన్​ జాడేదీ?

కొత్త మాస్టర్​ ప్లాన్​ జాడేదీ?

జనగామ, వెలుగు: జనగామ మున్సిపల్ కొత్త​ మాస్టర్​ ప్లాన్​ అమలు మూడడగులు ముందుకు ,  ఆరడుగులు వెనక్కి అన్నట్టు  మారింది.     జిల్లా కేంద్రంగా  జనగామ టౌన్ శరవేగంగా​ విస్తరించడం, జనాభా పెరుగుదల తో గతంలో కొత్త మాస్టర్​ ప్లాన్​ అవసరం అని లీడర్లు, ఆఫీసర్లు నిర్ణయించారు.  దీంతో  2018  మాస్టర్​ ప్లాన్​ ప్రారంభించినా నేటికీ ఫైనల్​ కాలేదు.  2041 యేడాది వరకు ఉండే పరిస్థితుల అంచనాలతో  టౌన్​ ప్లాన్​ ను రూపొందించే పనిని అప్పట్లో డీడీఎఫ్​ కన్సల్టెన్సీ కి అప్పగించారు. ఈ ప్రక్రియ ఏడాది క్రితం ఓ కొలిక్కి వచ్చినట్టే వచ్చి మళ్లీ నిలిచి పోయింది.  టౌన్​ విస్తరణ, నివాసాలు, భూములు వాటి సర్వే నెంబర్లు, ఇండస్ట్రియల్​ ప్రాంతం, జల వనరులు, బఫర్​ జోన్​లు, రోడ్ల కనెక్టివిటీ అంశాలను ప్లాన్​లోకి తీసుకున్నారు. వాటిని  గతేడాది ఏప్రిల్​లో  డీడీఎఫ్​ కన్సల్టెన్సీ ప్రతినిధులు అధికారులకు వివ​రించారు. అప్పటి అడిషనల్​ కలెక్టర్  అబ్దుల్​ హమీద్​,  చైర్​ పర్సన్​  జమున, మున్సిపల్​ ఆర్​డీ మైఖేల్​,  మున్సిపల్​ కమిషనర్,  కౌన్సిలర్లు   సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు.  మరోమీటింగ్​తో ఫైనల్​ రిపోర్ట్​ తయారు చేయాలని నిర్ణయించినా ఇప్పటికీ ఆ ప్లాన్​పై ఉలుకు లేదు, పలుకు లేదు. 

ప్రతిపాదనలు ఇవే.. 

  •   పాత మాస్టర్​ ప్లాన్​లో జనగామ టౌన్​ 16.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండగా కొత్త ప్లాన్​లో 17.91 చదరపు కిలోమీటర్లకు  విస్తరించడం. 
  •   టౌన్​ శివారుల్లోని శామీర్​పేటకు చెందిన అరవింద్​ నగర్​, వికాస్​ నగర్​, చిటకోడూరు లోని రాజీవ్​ నగర్​, యశ్వంతాపూర్​లోని ఎల్లమ్మ టెంపుల్స్​ను  కలపడం
  •   2011 లెక్కల ప్రకారం 64,430 వేలు  ఉన్న జనాభా 2041 వరకు లక్షా 50 వేలకు చేరుతుందని అంచనా వేశారు. భవిష్యత్​ అవసరాల కోసం రోడ్ల విస్తరణను ప్లాన్​లో పెట్టారు. 
  •   ప్రధాన రహదారులుగా ఉన్న జనగామ,  సూర్యాపేట, సిద్ధిపేట, హన్మకొండ, హైదరాబాద్​ రోడ్లు 150 ఫీట్లు చేయడం 
  •   కొత్త వెంచర్లు, నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని  ఇంటర్నల్​ రోడ్లన్నీ 40 ఫీట్లకు పైనే ఉండేలా చూడటం.
  •   జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ సమస్య ను అధిగమించేందుకు ప్రస్తుతం టౌన్​లో ఉన్న ఇంటర్నల్​ రోడ్లను కూడా 40 నుంచి 60 ఫీట్ల మధ్య వెడల్పు  చేయడం.
  •   రైల్వే స్టేషన్​ రోడ్డు రద్దీ  పెరుగుతుండటంతో దీన్ని  60 ఫీట్​ రోడ్ గా  విస్తరించడం.
  •   జనగామ మున్సిపల్​తో కనెక్టివిటీ ఉండే   ఎల్లంల, వడ్లకొండ, చిటకోడూరు, నాగారం రోడ్లను 80 ఫీట్లకు పెంచడం. 
  •   కుంటలు చెరువులు 10 హెక్టార్లకు పైగా విస్తరించి ఉంటే దాని ఎఫ్​టీఎల్ పరిధికి 30 మీటర్ల వరకు నిర్మాణాలకు అనుమతి ఉండదు. 10 హెక్టార్లలోపు విస్తీర్ణం ఉన్న వాటికైతే 9 మీటర్లకు అనుమతులు ఉండవు. వాగులు, కెనాల్​లుకు 2 మీటర్ల దూరం వరకు పర్మిషన్లు ఉండవు.

టౌన్​ చుట్టూ రింగ్​ రోడ్డు

జనగామ టౌన్​ చుట్టూ రింగ్​ రోడ్డు నిర్మాణం కోసం ప్లాన్​ లో పెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్​ వరంగల్​కు ఉన్న జాతీయ రహదారిని కలిపేలా హైదరాబాద్​ సిద్ధిపేట రోడ్డు మీదుగా చిటకోడూరు యశ్వంతాపూర్​ వద్ద కలుపుతూ రింగ్​ రోడ్​ ఉండాలని సూచించారు. ఇండస్ట్రీయల్​ ఏరియాల్లో ఎక్కువ మొత్తం నివాసాలు ఏర్పడగా ప్లాన్​లో కొంత మార్పులకు అవకాశం కల్పించాలన్న సూచనలున్నాయి.  ఇండస్ట్రీయల్​ జోన్​లో నివాస సముదాయాలు ఎక్కువైన చోట దానిని నివాస యోగ్యంగా మార్చి ఇండస్ట్రీయల్​ను టౌన్​ శివా రుల్లోకి షిఫ్ట్​ చేసేలా ప్లాన్​ చేయాలని సూచించారు.