
9 ఫారిన్ శాటిలైట్లనూ మోసుకుపోనున్న పీఎస్ఎల్వీ సీ48
మధ్యాహ్నం 3.25 గంటలకు షార్ నుంచి ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. దేశ సరిహద్దులను అడుగడుగునా జల్లెడ పట్టే పవర్ ఫుల్ నిఘా శాటిలైట్ ‘రిశాట్–2బీఆర్1’ను రేపు నింగికి పంపనుంది. దీనితో పాటు మరో 9 ఫారిన్ శాటిలైట్లను కూడా పీఎస్ఎల్ వీ సీ48 రాకెట్ బుధవారం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట షార్ లోని ఒకటవ ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 3.25 గంటలకు నింగికి మోసుకుపోనుంది. ఇస్రో కొత్తగా ఏర్పాటు చేసుకున్న కమర్సియల్ విభాగం ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)’ ఆయా దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఫారిన్ శాటిలైట్లను ప్రయోగించనున్నారు. ఈ మిషన్ లో పీఎస్ఎల్ వీ-క్యూఎల్ వేరియంట్ రాకెట్ ను ప్రయోగించనున్నారు. దీనికి నాలుగు స్ట్రాప్ ఆన్ బూస్టర్లు ఉంటాయి. అన్నింట్లో కలిపి 48 టన్నుల ఇంధనం నింపారు. పీఎస్ఎల్ వీ-క్యూఎల్ వేరియంట్ రాకెట్ ను ఇస్రో ప్రయోగించనుండటం ఇది రెండోసారి. షార్ నుంచి ఇది 75వ రాకెట్ ప్రయోగం. మొత్తం మిషన్16 నిమిషాల్లో పూర్తి కానుంది. రిశాట్-2బీఆర్1ను 576 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి పీఎస్ఎల్ వీ సీ48 రాకెట్ చేర్చనుంది. అనంతరం ఒక నిమిషం తర్వాత విదేశీ శాటిలైట్లను వరుసగా కక్ష్యలోకి విడిచిపెట్టనుంది. ఇప్పటివరకూ ఇస్రో310 ఫారిన్ శాటిలైట్లను నింగికి చేర్చింది.
పీఎస్ఎల్వీ సీ48 మోసుకెళ్లే శాటిలైట్లు ఇవే..
పేలోడ్: రిశాట్-–2బీఆర్1
9 విదేశీ పేలోడ్లు: 4 మల్టీ మిషన్ లెమూర్ శాటిలైట్లు, తైవాక్ 0129 (టెక్నాలజీ డెమోన్ స్ట్రేషన్ శాటిలైట్), 1హాప్ శాట్ (ఎర్త్ ఇమేజింగ్ శాటిలైట్). ఇవి నాలుగూ అమెరికా శాటిలైట్లు.
రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ డచిఫ్యాట్–3 (ఇజ్రాయెల్)
సెర్చ్ అండ్ రెస్క్యూ శాటిలైట్ తైవాక్–0092 (ఇటలీ)
రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ క్యూపీఎస్–ఎస్ఏఆర్ (జపాన్)
పీఎస్ఎల్ వీ@50
26 ఏండ్ల కిందట.. సెప్టెంబర్ 20, 1993. తెల్లవారుజామున 5.12 గంటల సమయం. శ్రీహరికోటలోని షార్. ఇస్రో సైంటిస్టులంతా ఉత్కంఠగా ఉన్నారు. కౌంట్ డౌన్ ముగియగానే పీఎస్ఎల్ వీడీ1 రాకెట్ ఐఆర్ఎస్1ఈ శాటిలైట్‌ను మోసుకుని ఆకాశానికి దూసుకెళ్లింది. కానీ.. సాఫ్ట్ వేర్ ఎర్రర్ కారణంగా ఆ శాటిలైట్‌ను కక్ష్యలోకి చేర్చలేకపోయింది. మరుసటి ఏడాది అక్టోబర్15న పీఎస్ఎల్ వీ డీ2 ప్రయోగం చేపట్టిన ఇస్రో.. ఐఆర్ఎస్ పీ2 శాటిలైట్ ను విజయవంతంగా నింగికి చేర్చింది. ఇక అప్పటి నుంచి ఈ రాకెట్ తిరుగులేని విజయాలు సాధిస్తూనే ఉంది. ఇప్పటివరకూ రెండు సార్లే ఫెయిలైంది. ఇస్రో ‘గెలుపుగుర్రం’గా పేరు పొందింది. బుధవారం నాటి మిషన్ పీఎస్ఎల్ వీకి 50వ ప్రయోగం. అయితే, ‘‘ఈ 50 ప్రయోగాలకు 26 ఏండ్లు పట్టాయి. కానీ వచ్చే ఐదేండ్లలోనే మరో 50 ప్రయోగాలతో 100 ప్రయోగాలను పూర్తి చేస్తాం” అని కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం ఏడాదికి 10 ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఇస్రో చేరుకుందన్నారు. పీఎస్ఎల్ వీ రాకెట్ తన 50వ ప్రయోగంతో మొత్తం 319 శాటిలైట్లను నింగికి చేర్చనుంది. వీటిలో 63 శాటిలైట్లు మన దేశానివి, మిగతావన్నీ ఫారిన్ శాటిలైట్లే.