పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?

పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణాలేంటి?

దేశంలో గుండె పోటుతో చనిపోతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా.. చిన్నవయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పతున్నారు. ఏదో ఒక పనిచేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. వ్యాయమం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్టే క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళలకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సాధారణం. కానీ ఏ కారణం లేకుండానే కేవలం కొన్ని సెకన్ల పాటు గుండే వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణం అని వైద్యులు చెబుతున్నారు. 

గుండెపోటు మరణాలు

2021 అక్టోబరు 29న కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో కన్నుమూశారు. 49ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడాన్ని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అదే ఏడాది సెప్టెంబర్ 2న టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. ఈ ఏడాది సెప్టెంబర్ 21న కమెడియన్ రాజు శ్రీవాస్తవ జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలారు. చివరకు హార్ట్ ఎటాక్ తో కన్నుమూశారు. దసరా సందర్భంగా  జమ్మూకశ్మీర్‌లో ఏర్పాటు చేసిన గార్భా కార్యక్రమంలో పాల్గొన్న 21ఏళ్ల యువకుడు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో స్టేజ్‌పైనే కుప్పకూలాడు. ముంబయిలో 35ఏళ్ల వ్యక్తి గర్బా ఆడుతూ గుండెపోటుతో మరణించారు. గతవారం క్రితం 33ఏళ్ల జిమ్ ట్రైనర్ కూర్చున్నప్పుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత గుండె పోటుతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. 

కరోనా ప్రభావం ఎంత వరకు ఉందా?

కరోనా వచ్చిన తర్వాతే గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నారు. అయితే ఈ మరణాలకు కరోనాయే కారణమని చెప్పే ఆధారాలేవీ లేవని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే కోవిడ్ వచ్చిన పోయిన తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పులు కూడా పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

గుండెపోటుకు స్పానిష్ ఫ్లూ కూడా కారణమా?

1918లో స్పానిష్ ఫ్లూ వ్యాప్తి తర్వాత, కొందరిలో బ్రెయిన్ ఫాగ్, నీరసం లాంటి లక్షణాలు కనిపించాయి. బ్రెయిన్ ఫాగ్ అంటే మతిమరుపు.. ఆలోచనా విధానం తగ్గిపోవడం. పదే పదే మర్చిపోవడం ఈ లక్షణాలు కోవిడ్ తర్వాత చాలామందిలో బయటపడ్డాయి. ఆ తర్వాత వరుసగా గుండెపోటు కేసులు కూడా పెరుగుతూ వచ్చాయి. 1940 నుంచి 1959 మధ్య ఒక్కసారిగా ఈ  కేసులు అమాంతం పెరిగాయి.  ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడంతో వైద్యులు కూడా ఆందోళన చెందారు. అయితే.. ఫ్లూ మహమ్మారే దీనికి కారణమని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా పురుషుల్లో గుండెపోటు కేసులు ఎక్కువగా కనిపించాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా పురుషుల్లోనే గుండెపోటు ఎక్కువగా వ్యాపిస్తోంది. మరోవైపు బిడ్డ కడుపులో ఉన్నప్పుడే.. తల్లి స్పానిస్ ఫ్లూ వైరస్ బారినపడితే, 60 ఏళ్ల తర్వాత కూడా వారిని అనారోగ్యాల ముప్పు వెంటాడే అవకాశం ఉందని వైద్యులు తెల్చారు.