Rishabh Pant: అది జరిగితేనే పంత్ టీ20 ప్రపంచకప్‍ జట్టులో ఆడగలడు: జై షా

Rishabh Pant: అది జరిగితేనే పంత్ టీ20 ప్రపంచకప్‍ జట్టులో ఆడగలడు: జై షా

రెండేండ్ల క్రితం కారు ప్రమాదంలో మృత్యుంజ‌యుడిగా బ‌య‌ట‌ప‌డిన‌ పంత్, ఐపీఎల్ 17వ సీజ‌న్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జట్టులో అతని పాత్ర ఏంటనేదానిపై స్పష్టత లేనప్పటికీ.. పంత్ ఐపీఎల్‌లో ఆడతాడనేది ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలావుంటే, 2024 జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో పంత్ ఆడే అవకాశాలపై బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెరతీశారు.

ప్రస్తుతం పంత్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్ రెండూ సాధన చేస్తున్నాడని తెలిపిన జైషా, అతడు టీ20 ప్రపంచకప్ ఆడితే భారత జట్టుకు పెద్ద బలం చేకూరినట్లువుందని వెల్లడించాడు. "పంత్ ప్రస్తుతం బాగున్నాడు. బ్యాటింగ్‌తో పాటుగా కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. త్వరలోనే అతని ఫిట్‌నెస్‌పై ప్రకటన విడుదల చేస్తాం. ఒకవేళ అతను టీ20 ప్రపంచకప్‌ ఆడగలిగితే.. టీమిండియాకు ప్లస్ పాయింట్.  ఐపీఎల్‌లో అతను ఎంతవరకు రాణిస్తాడో స్తాడో చూద్దాం.. " అని షా ఓ జాతీయ ఛానెల్‍తో అన్నారు.

కీపింగ్ చేస్తేనే ప్రపంచ కప్‍ జట్టులో..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో పంత్ రీఎంట్రీ కంఫర్మ్ అయినప్పటికీ.. అతను ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించేది, కీపింగ్ చేసేది అనుమానంగా మారింది. పంత్ పూర్తిగా ఫిట్‌గా లేకుంటే అతన్ని కొంచెం భిన్నమైన పాత్రలో ఉపయోగించాల్సి ఉంటుందని ఆ జట్టు హెడ్‌కోచ్ రికీ పాంటింగ్‌ వెల్లడించారు. ఈ మాటలను బట్టి పంత్ మున‌ప‌టిలా వికెట్ కీపర్, బ్యాట‌ర్‌గా ఆడ‌డం క‌ష్టమే. అత‌నిపై ఎక్కువ భారం ప‌డ‌కుండా వికెట్ కీపింగ్ బాధ్యత‌లు మరొకరికి అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయాన్నీ జై షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. కీపింగ్ చేయగలిగితేనే టీ20 ప్రపంచకప్‍లో రిషబ్ పంత్ ఆడతాడని స్పష్టం చేశారు.

ఢిల్లీ క్యాపిటల్స్ షెడ్యూల్

మార్చి 22న ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభంకానుండగా.. తొలి పోరులో ఢిల్లీ జ‌ట్టు మార్చి 23న పంజాబ్ కింగ్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

  • మార్చి 23న: పంజాబ్ కింగ్స్‌తో
  • మార్చి 28న: రాజస్థాన్ రాయల్స్‌తో
  • మార్చి 31న: చెన్నై సూపర్ కింగ్స్‌తో 
  • ఏప్రిల్ 03న: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో
  • ఏప్రిల్ 07న: ముంబై ఇండియన్స్‌తో