వీడియో: రీఎంట్రీ టైమ్లో ఏడుపుగొట్టు సీన్లెందుకు? .. అసిస్టెంట్ డైరెక్టర్‌పై రిషబ్ పంత్ సీరియస్

వీడియో: రీఎంట్రీ టైమ్లో ఏడుపుగొట్టు సీన్లెందుకు? .. అసిస్టెంట్ డైరెక్టర్‌పై రిషబ్ పంత్ సీరియస్

యాడ్ షూట్ సెట్స్‌లో సిబ్బందిపై భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా నోరుపారేసుకున్న ఘటన మరవకముందే రిషబ్ పంత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిషబ్‌కు సైతం కమర్షియల్ సెట్స్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ సన్నివేశంలో పంత్ కెమెరా ముందు కంటతడి పెట్టాల్సివుండగా.. స్క్రిప్ట్ మార్చాలని అసిస్టెంట్ డైరెక్టర్‌కు సూచించారు. ఆ సంభాషణకు సంబంధించి లీకైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఏం జరిగిందంటే..?

కారు ప్రమాద గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్.. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్ ద్వారా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ఆ దిశగా కఠోర సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ కమర్షియల్ యాడ్ షూట్‌లో పాల్గొనగా.. అతనికి చేదు అనుభవం ఎదురైంది. భావోద్వేగాలతో ముడిపడివున్న ఓ సన్నివేశంలో పంత్ కంటతడి పెట్టేలా అసిస్టెంట్ డైరెక్టర్‌ స్క్రిప్ట్ రాశారు. అయితే, అది పంత్‌కు నచ్చలేదు. సంతోషంగా రీఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలో కెమెరా ముందు కన్నీరు కార్చడం ఇష్టం లేక స్క్రిప్ట్ నుంచి ఆ సన్నివేశాలు మార్చాలని అసిస్టెంట్ డైరెక్టర్‌కు సూచించారు. ఈ విషయంపై డైరెక్టర్‌తో మాట్లాడి తన అభిప్రాయాలను తెలియజేయమని కోరాడు.

Also Read :సహనం కోల్పోయిన హార్దిక్ పాండ్యా.. సిబ్బందిపై అరుపులు

 "ముఝే రోటే దేఖా హై కభీ? (నేను ఏడవడం మీరు ఎప్పుడైనా చూశారా?).. మేరెకో సెంటి నహీ హోనా,.." అని పంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు చెప్తున్న వీడియో క్లిప్ సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. కమర్షియల్ యాడ్ షూట్ కనుక పంత్ నిజంగానే సన్నివేశాలు తొలగించమని కోరారా..! అన్నది నమ్మశక్యంగా లేదు. మరోరకంగా చూస్తే, ఈ క్లిప్ ఐపీఎల్ 2024కి ముందు స్టార్ స్పోర్ట్స్ చేసిన ప్రచార వ్యూహంలో ఒక భాగంగా కనిపిస్తోంది. ఇందులో కూడా వాస్తవం లేకపోలేదు.