Rishabh Pant: ఆర్ధిక ఇబ్బందుల్లో మెరిట్ స్టూడెంట్.. ఫీజ్ మొత్తం వెంటనే చెల్లించిన రిషబ్ పంత్

Rishabh Pant: ఆర్ధిక ఇబ్బందుల్లో మెరిట్ స్టూడెంట్.. ఫీజ్ మొత్తం వెంటనే చెల్లించిన రిషబ్ పంత్

ఆ అమ్మాయి పేరు జ్యోతి. కర్ణాటకలోని ఒక పేద కుటుంబంలో జన్మించింది. బాగల్‌కోట్ జిల్లాలోని రబకవి గ్రామానికి చెందిన ఆమె  చదువులో మెరిట్ స్టూడెంట్. ఉన్నతమైన కలలను కంటూ కష్టపడి చదువుకుంటూ వస్తోంది. ఉన్నతంగా చదివి II PUC (12వ తరగతి)లో 85% మార్కులు సాధించింది. తర్వాత చదువుల కోసం ఆమె జంఖండిలోని BLDE కళాశాలలో BCA చదవాలనుకుంది. ఆమె పై చదువులక కోసం 40000 అవసరం. టీ అమ్మే ఆమె తండ్రి కూతురు చదువు కోసం 40000 అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు సిద్ధంగా లేడు. 

అదే గ్రామానికి చెందిన స్థానిక కాంట్రాక్టర్ అనిల్ హునాషికట్టి ఆమెకు అడ్మిషన్ ఇవ్వడానికి సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అతను బెంగళూరులోని తన స్నేహితులకు జ్యోతి ఆర్ధిక పరిస్థితుల గురించి వివరించాడు. పంత్ తన క్రికెట్ సర్కిల్ ద్వారా జ్యోతి చదువు కోసం పడే ఇబ్బందిని తెలుసుకున్నాడు. ఆమె దృఢ సంకల్పం పంత్ ను కదిలించింది. జ్యోతి తన చదువుకు అవసరమయ్యే డబ్బును కాలేజీకి వెంటనే ట్రాన్స్ ఫర్ చేశాడు. పంత్ రూ.40,000 చెల్లించడమే కాకుండా ఆమె చదువు మొత్తం పూర్తవడానికి కావాల్సిన చెల్లిస్తానని  హామీ ఇచ్చాడు. 

రిషబ్ పంత్ దయగల ప్రవర్తనకు జ్యోతి చలించిపోయి తన కృతజ్ఞతను వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను గలగలిలో నా II PUC పూర్తి చేశాను. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA) కోర్సును అభ్యసించాలని కలలు కన్నాను. కానీ మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేదు. నేను అనిల్ హునాషికట్టి అన్న (సోదరుడు)ని సంప్రదించాను. అతను బెంగళూరులోని తన స్నేహితులను సంప్రదించాడు. వారు నా పరిస్థితిని రిషబ్ పంత్ దృష్టికి తీసుకువచ్చారు. అప్పుడు అతను నాకు సహాయం చేసాడు. రిషబ్ పంత్ కు దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించుగాక. ఆయన సహాయం నాకు చాలా ముఖ్యం. నాలాంటి పేద నేపథ్యాల నుండి వచ్చిన ఇతర విద్యార్థులకు ఆయన మద్దతు ఇస్తూనే ఉంటారని నేను ఆశిస్తున్నాను" అని విద్యార్థిని తెలిపింది. 

ఇటీవలే ఇంగ్లాండ్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన పంత్ చివరి టెస్టులో పాదం గాయంతో ఆడలేకపోయాడు. మాంచెస్టర్ టెస్టులో గాయపడిన ఈ టీమిండియా వికెట్ కీపర్ నడవలేని స్థితిలోనే ఉన్నప్పటికీ బ్యాటింగ్ కు దిగాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో నాలుగు టెస్టులాడిన పంత్.. 68 యావరేజ్ తో 479 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు.. మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం గాయంతో ఇబ్బందిపడుతున్న పంత్ ఆసియా కప్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.