Wimbledon 2025: వింబుల్డన్‌లో నా సపోర్ట్ అతడికే.. కోహ్లీకి విరుద్ధంగా పంత్

Wimbledon 2025: వింబుల్డన్‌లో నా సపోర్ట్ అతడికే.. కోహ్లీకి విరుద్ధంగా పంత్

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ 2025 మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అంచనాలకు తగ్గట్టుగానే టాప్ -3 ఆటగాళ్లు కార్లోస్ అల్కరాజ్, నోవాక్ జొకోవిచ్, సిన్నర్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. అల్కరాజ్ ఇప్పటికే సెమీ ఫైనల్ కు అర్హత సాధించాడు. ఎంతమంది వింబుల్డన్ టైటిల్ గెలవడానికి పోటీలో ఉన్నప్పటికీ మరోసారి జొకోవిచ్,అల్కరాజ్ ఫైనల్ కు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు వింబుల్డన్ ఫైనల్స్ లో జొకోవిచ్ ను ఓడించి అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్స్ ను గెలుచుకున్నాడు. ఈ సారి కూడా వీరిద్దరే ఫైనల్ కు రావడం ఖాయంగా కనిపిస్తుంది.  

2025 వింబుల్డన్ టైటిల్ ఎవరు గెలుస్తారో తన సపోర్ట్ ఎవరికో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భాగంగా ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లోనే ఉంది. మూడో టెస్టుకు ముందు మూడు రోజులు గ్యాప్ రావడంతో సోమవారం (జూలై 7) రిషబ్ పంత్ విబుల్డన్ మ్యాచ్ కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పంత్ మాట్లాడుతూ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. వింబుల్డన్ విజేతగా తన ఎంపికను వెల్లడించాడు. కార్లోస్ అల్కరాజ్ టైటిల్ గెలుస్తాడని అంచనా వేశాడు. 

"నేను అల్కరాజ్‌కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాను. అతను వింబుల్డన్ గెలుస్తాడని భావిస్తున్నాను. అదే నా అంచనా. ఎవరు బెస్ట్  టెన్నిస్ ఆడతారో వారు చివరికి గెలుస్తారు." అని పంత్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ జొకోవిచ్ కు సపోర్ట్ ఇచ్చాడు. కోహ్లీ మాట్లాడుతూ.. "ఈ వింబుల్డన్ ఫైనల్స్ లో నోవాక్, కార్లోస్ ఫైనల్స్‌లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. బహుశా నోవాక్ ఈ టైటిల్ గెలవాలని కోరుకుంటున్నాను. టైటిల్ సాధిస్తే జొకోవిచ్ కెరీర్ లో ఇది అత్యంత గొప్ప విషయం అవుతుంది". అని చెప్పడం విశేషం. పంత్, కోహ్లీ ఇద్దరూ వేరు వేరు ప్లేయర్లకు సపోర్ట్ చేయడం విశేషం. 

వింబుల్డన్ విషయానికి వస్తే అమెరికా స్టార్‌‌ ప్లేయర్‌‌ టేలర్‌‌ ఫ్రిట్జ్‌‌ తొలిసారి వింబుల్డన్‌‌ సెమీస్‌‌లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో ఐదో సీడ్‌‌ ఫ్రిట్జ్‌‌ 6–3, 6–4, 1–6, 7–6 (4)తో కారెన్‌‌ కచనోవ్‌‌ (రష్యా)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో కార్లోస్‌ అల్కరాజ్‌ (స్పెయిన్‌) 6–2, 6–3, 6–3తో కామెరూన్‌ నోరి (బ్రిటన్‌)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించాడు. బలమైన సర్వీస్‌లు, క్రాస్‌ కోర్టు విన్నర్లతో చెలరేగిన కార్లోస్‌ గంటా 39 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు.