
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు భారీ ఊరట కలిగింది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో గాయపడిన పంత్ సర్జరీ నుంచి తప్పించుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గాయపడిన రిషబ్.. ఓవల్ లో జరిగిన ఐదో టెస్టుకు దూరమయ్యాడు. కాలికి తీవ్ర గాయం కావడంతో మొదట సర్జరీ అవసరమని భావించినా.. ఆ తర్వాత ఆ అవసరం లేదని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. అయితే గాయపడిన పంత్ కు 6 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో పంత్ సెప్టెంబర్ లో జరగబోయే ఆసియా కప్ కు దూరమయ్యాడు.
ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో పాటు స్వదేశంలో అక్టోబర్ లో జరగాల్సిన టెస్ట్ సిరీస్ కు సైతం అందుబాటులో ఉండడు. గాయం పూర్తిగా తగ్గి ఫిట్ నెస్ సాధించడానికి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు రెండు నెలల సమయం పడుతుంది. టీమిండియా తమ తదుపరి వన్డే, టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో ఈ మెగా సిరీస్ ప్రారంభమవుతుంది. కంగారులతో జరగనున్న ఈ మెగా సిరీస్ కు పంత్ అందుబాటులో ఉంటాడు.
అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. కోహ్లీ, రోహిత్ లను ఇకపై ఆస్ట్రేలియాలో చూడబోతున్నాం. 2027లో సౌతాఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు వీరిద్దరూ ఆడి తమ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది.
అసలేం జరిగిందంటే..?
ఇంగ్లాండ్, ఇండియా మధ్య బుధవారం (జూలై 23) నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్ లో జట్టు స్కోర్ 141 పరుగుల వద్ద గిల్ ఔటైనప్పుడు పంత్ బ్యాటింగ్ కు వచ్చాడు. తనదైన శైలిలో ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చూపంచాడు. 48 బంతుల్లోనే 2 ఫోర్లు, సిక్సర్ తో 37 పరుగులు చేసి దూకుడు మీదున్నాడు. ఈ సమయంలో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. మూడో సెషన్లో వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో పంత్ పాదానికి తీవ్ర గాయమైంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది. ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‌గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు.