Rishabh Pant: లక్నో కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ ఔట్.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే

Rishabh Pant: లక్నో కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ ఔట్.. సంజీవ్ గోయెంకా ఏమన్నారంటే

Rishabh Pant: ఐపీఎల్ ప్రారంభానికి మరో రెండు రోజుల ముందు లక్నో సూపర్ జయంట్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. లక్నో జట్టు కెప్టెన్సీ నుంచి రిషభ్ పంత్ ని తప్పించబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కాగా LSG కెప్టెన్ పంత్ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ఆ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా తెరదించారు. 2025 సీజన్‌లో రిషభ్ పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, అతడిపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.

2025 మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ. 27 కోట్లకు రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. 18వ ఎడిషన్ లో పంత్ కెరీర్‌లోనే అత్యంత దారుణంగా ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో కేవలం 24.45 సగటుతో 269 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉన్నాయి. దీంతో పంత్ సారథ్యంలో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. ఐపీఎల్ లో పేలవమైన ప్రదర్శన కారణంగా రిషభ్ పంత్ టీమిండియా టీ20 జట్టులో పునరాగమనం చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా పంత్ నాలుగు సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. దీంతో అతడి కెప్టెన్సీ సామర్థ్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తారనే వార్తలపై సంజీవ్ గోయెంకా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. ఈ సీజన్‌కు ముందు రిషభ్ పంత్ కెప్టెన్సీ గురించి వస్తున్న ఊహాగానాలను చూసి నేను నవ్వుకున్నాను.. అతడి వ్యక్తిత్వం, నిబద్ధత గురించి మాకు బాగా తెలుసు.. హ్యావ్ ఏ గ్రేట్ సీజన్, క్యాప్టెన్! అంటూ రాసుకొచ్చాడు. ఎల్ఎస్ జీ ఓనర్ చేసిన ఈ పోస్ట్‌తో 2026 సీజన్‌లో కూడా లక్నో జట్టుకు పంత్ సారథ్యం వహిస్తాడని తేలిపోయింది. మరోవైపు, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ, సంజీవ్ గోయెంకా మధ్య సోషల్ మీడియాలో తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ జట్ల అమ్మకం తర్వాత ఐపీఎల్ బ్యాండ్ వ్యాల్యూ పెరగడంపై గోయెంకా చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి దారితీశాయి. ఒకవైపు ఈ వివాదం నడుస్తుండగానే, పంత్‌కు మద్దతుగా నిలిచి గోయెంకా అందరి దృష్టిని ఆకర్షించారు.