ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునాక్

ప్రధాని రేసులో దూసుకెళ్తున్న రిషి సునాక్

 బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునాక్  దూసుకుపోతున్నారు. నాల్గో  రౌండ్‌లోనూ ఆయన తిరుగులేని మెజారిటీ సాధించారు. ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థుల్లో అత్యధిక ఓట్లను రిషి సొంతం చేసుకున్నారు. తాజాగా నిర్వహించిన నాల్గో రౌండ్‌ ఓటింగ్‌లో రిషి సునాక్‌కు 118 ఓట్లు పోలయ్యాయి. ప్రధాని పదవికి ఆయనతో పోటీ పడుతోన్న ఇతర అభ్యర్థులెవరూ గానీ ఈ స్థాయి ఓట్లను సాధించలేకపోయారు. 

తాజా ఓటింగ్ లో రిషి 120 ఓట్లు సాధించి ఉంటే ఆయన నేరుగా ఫైనల్ కంటెండర్గా నిలిచేవారు. నాల్గో రౌండ్ లో బ్రిటన్ ట్రేడ్ మినిస్టర్ పెన్నీ మోర్డాంట్ కు 92 ఓట్లు రాగా.. ఫారిన్ సెక్రటరీ లిజ్ ట్రాస్ కు 86 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ ఓట్లు రావడంతో  కెమ్మి బెడెనోచ్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బోరిస్ జాన్సన్ అనంతరం రిషి సునాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికి ఫస్ట్ రౌండ్ ఓటింగ్ నుంచి రిషి జైత్రయాత్ర కొనసాగుతోంది. ప్రత్యర్థులెవరూ ఆయన దరిదాపుల్లో లేకపోవడంతో బ్రిటన్ తదుపరి ప్రధానిగా రిషి బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు. భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడైన రిషి బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ప్రధానిపై అసంతృప్తితో కొంతకాలం క్రితం పదవికి రాజీనామా చేశారు.