మూడో రౌండ్లోనూ రిషిదే ఆధిక్యం

మూడో రౌండ్లోనూ రిషిదే ఆధిక్యం

బ్రిటన్‌ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ దూసుకుపోతున్నారు. ప్రధాని అభ్యర్థిని ఎన్నుకునేందుకు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీ సోమవారం మూడో రౌండ్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించింది. ఇందులోనూ అత్యధికంగా 115 ఓట్లను రిషి దక్కించుకున్నారు. మహామహులను దాటుకొని రిషి ముందంజలో నిలిచారు. బ్రిటన్ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్ డాంట్ కు 82 ఓట్లు, విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రూస్ కు 71 ఓట్లు, సమానతా శాఖ మాజీ మంత్రి కెమీ బాడెనోచ్ కు 71 ఓట్లు, బ్రిటన్ పార్లమెంటు విదేశాంగ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు టామ్ టుగెన్ ధాట్ కు 31 ఓట్లు పడ్డాయి. అతి తక్కువ ఓట్లు వచ్చినందున టామ్ టుగెన్ ధాట్ పోటీ నుంచి తప్పుకున్నారు. గత రౌండ్ లో రిషికి 101 ఓట్లే పోల్ కాగా, తాజా రౌండ్ లో ఏకంగా 14 ఓట్లు అదనంగా (115) పోల్ అయ్యాయి. 

ఆ నలుగురే మిగిలారు..

ప్రస్తుతం రిషికి ప్రధాన పోటీదారులుగా కెమీ బాడెనోచ్, లిజ్ ట్రూస్, పెన్నీ మోర్ డాంట్  ఉన్నారు. కెమీ బాడెనోచ్ కు గత రౌండ్ లో 49 ఓట్లే రాగా ఈసారి 71 ఓట్లు వచ్చాయి.  లిజ్ ట్రూస్ ఓట్లు  64 నుంచి 71కి పెరిగాయి. పెన్నీ మోర్ డాంట్ ఓట్లు 83 నుంచి 82కు తగ్గాయి. ఈవిధంగా విడతల వారీగా జరిగే ఓటింగ్ లో 120 మంది పార్లమెంటు సభ్యుల మద్దతును కూడగట్టే ఇద్దరిని ప్రధాని అభ్యర్థిత్వానికి ఎంపిక చేసి, తుది ఓటింగ్ నిర్వహిస్తారు. ఫైనల్ రౌండ్ లో దాదాపు 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ రిజిస్టర్డ్ సభ్యులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రధాని అభ్యర్థులకు ఓటింగ్ వేస్తారు. ఇందులో గెలిచే వారే బోరిస్ జాన్సన్ స్థానంలో సెప్టెంబరు 5న ప్రధాని పదవిని చేపడతారు. ఈనేపథ్యంలో ఇవాళ నాలుగో రౌండ్ ఓటింగ్ జరగనుంది.  
  
ఎన్నిక ప్రకియ ఇదీ..
 
ప్రధానమంత్రి పదవి కోసం కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు.  అయితే ప్రతి అభ్యర్థిని ఇద్దరు కన్జర్వేటివ్‌ సభ్యులు.. ప్రతి రౌండ్ లో నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఎంపీలు పోటీలో నిలిస్తే.. వారి సంఖ్యను కుదించేందుకు ఇలా పలు రౌండ్ల ఎన్నిక జరుగుతుంది. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్ధతిలో నిర్వహించే ఈ ఎన్నికలో తమకు ఇష్టమైన అభ్యర్థికి ఎంపీలు ఓటు వేయొచ్చు. ప్రతి రౌండ్ లో అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు మాత్రమే పోటీలో మిగిలేంత వరకూ.. ఓటింగ్ రౌండ్స్ జరుగుతూనే ఉంటాయి. చివరకు మిగిలే ఇద్దరిలో ఒకరినే తమ పార్టీ ముఖ్య నాయకుడిగా ఎన్నుకుంటారు. ఇందుకోసం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ మద్దతును తెలియజేస్తారు. ఇందులోనూ గెలుపొందే వ్యక్తిని కొత్త నాయకుడిగా ప్రకటిస్తారు. పార్లమెంటులో మెజారిటీ కలిగిన పార్టీ తరఫు అభ్యర్థే కొత్త ప్రధానిగా నియమితులవుతారు.