
- రిటైల్ లోన్లదీ ఇదే పరిస్థితి
- రూ.35 వేల కోట్ల విలువైన లోన్లపై ఎఫెక్ట్
ముంబై: రిటైల్ లోన్ల విభాగంలో మొండిబకాయిలు పెరుగుతుండటం బ్యాంకులను కలవరపెడుతోంది. లోన్ల వసూలు నెమ్మదించిందని తాజా స్టడీ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన క్వార్టర్ నాటికి రూ.35 వేల కోట్ల విలువైన లోన్ల చెల్లింపు ఆలస్యమైనట్టు ప్రకటించింది. చాలా మంది కస్టమర్ల డెలిక్వెన్సీ (వాయిదాల చెల్లింపును ఆలస్యం చేయడం) పెరుగుతోందని సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ తెలిపింది. 30–90 రోజుల గడువున్న రిటైల్ లోన్లలో డెలిక్వెన్సీ మూడుశాతానికి చేరింది. ఆటోలోన్ల పోర్ట్‌ఫోలియోలో రూ.4,500 కోట్ల విలువైన లోన్ల వసూలు ప్రశ్నార్థకంగా మారింది. ‘‘ పోర్ట్ ఫోలియో ఎట్ రిస్క్ 30 బేసిస్ పాయింట్లు పెరిగింది. 31–90 రోజుల గడువున్న లోన్ల ‘పోర్ట్ ఫోలియో ఎట్ రిస్క్’ 74 బీపీఎస్‌లు పెరిగింది. టూవీలర్ల లోన్లకు మార్చి–జూన్ క్వార్టర్లో పోర్ట్‌ఫోలియో ఎట్ రిస్క్’ 9 బీపీఎస్‌లు పెరిగింది. ఆటోలోన్లకు 9 బీపీఎస్ పెరిగింది. 91–180 రోజుల గడువు లోన్లకు ఇది 30 బీపీఎస్‌లు, ఆటోమొబైల్ లోన్లకు 20 బీపీఎస్‌లు పెరిగింది’’ అని సీఆర్‌ఐఎఫ్ సీనియర్ వైస్–ప్రెసిడెంట్ పారిజాత్ గర్గ్ అన్నారు. కార్పొరేట్లకు ఇచ్చే లోన్లలో మొండిబకాయిలు పెరుగుతుండటంతో బ్యాంకులు గత ఐదేళ్లుగా రిటైల్ లోన్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. చాలా మంది ఆదాయాలు తగ్గడం, కొంతమంది ఉద్యోగాలు కోల్పోవడంతో రిటైల్ లోన్ల ఎగవేతలు కొద్దిగా పెరిగాయి. కంపెనీలు దివాలా తీయడం వల్లే చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. గత ఏడాది ఐఎల్‌ఎఫ్‌ఎస్ దివాలా తీయడం, తదనంతరం ఎన్‌బీఎఫ్‌సీలకు అప్పు పుట్టడం కష్టమయింది. ‘‘రిటైల్ కస్టమర్లకు కూడా క్యాఫ్‌ఫ్లో, లిక్విడిటీ సమస్యలు పెరిగాయి. అయితే ఇప్పటి వరకు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. 90 రోజులకుపైగా చెల్లింపు గడువు ఉన్న లోన్లు బాగానే వసూలవుతున్నాయి ’’ అని బీఎన్‌పీ పరిబాస్ ఎనలిస్టు లలితాబ్ శ్రీవాస్తవ చెప్పారు. బ్యాంకుల అన్‌సెక్యూర్డ్ లోన్ల విలువ ఆల్‌టైం హైకి చేరింది. క్రెడిట్‌కార్డ్ ఔట్‌స్టాండింగ్ విలువ గత జూలైలో రూ.74,300 కోట్లు కాగా, ఈ ఏడాది జూలైలో ఇది రూ.94 వేల కోట్లకు చేరింది. ఇదే కాలంలో పర్సనల్ లోన్ల విలువ రూ.19 లక్షల కోట్ల నుంచి రూ.22.7 లక్షల కోట్లకు చేరింది.
రెపోరేటు లింక్డ్ హోంలోన్ స్కీమ్ వెనక్కి…
ఇక నుంచి ఆర్‌బీఐ రెపోరేటు ప్రకారం అన్ని లోన్లకు వడ్డీరేట్లు నిర్ణయిస్తామని ప్రకటించిన స్టేట్ బ్యాంక్.. యూటర్న్ తీసుకుంది. హోంలోన్లకు ఇలాంటి విధానాన్ని తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఇక నుంచి మార్జినల్ కాస్ట్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్‌ఆర్ ) ప్రకారమే హోంలోన్లు ఇస్తామని ట్వీట్ చేసింది. అయితే ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం.. వచ్చే నెల నుంచి రెపోరేటు ఆధారిత లోన్లను అందుబాటులోకి తేనుందని సమాచారం.