ఆదిలాబాద్ జిల్లాలో అమాంతం పెరిగిన మాంసం ధరలు

ఆదిలాబాద్ జిల్లాలో అమాంతం పెరిగిన మాంసం ధరలు

చాలా మందికి ముక్కలేనిదే ముద్దదిగదు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిపోతున్న ధరలు.. మాంసం ప్రియులకు ముక్కలకు బదులు చుక్కలు చూపిస్తున్నాయి. నోరు కట్టేసుకుని కూర్చునేలా చేస్తున్నాయి. దీంతో ఏం కొనేతట్టు లేదు.. ఏం తినేతట్టు లేదంటున్నారు పబ్లిక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాంసం ధరలు అమాంతం పెరిగిపోయాయి. మటన్, చికెన్, కోడిగుడ్డు.. ఇలా అన్నింటి ధరలు దూసుకెళ్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు వంద రూపాయలు ఉన్న చికెన్ ధర ప్రస్తుతం కిలో 280 రూపాయలకి పైగా పలుకుతోంది. గతంలో 150 వరకు మాత్రమే పరిమితమైన చికెన్ ధర, సమ్మర్ ఎఫెక్ట్ తో పైపైకి దూసుకెళ్తోంది. పట్టణ ప్రాంతాల్లో కిలో చికెన్ 280 పలికితే.. పల్లెల్లో మరో ఇరవై ముప్పై రూపాయలు ట్రాన్స్ పోర్ట్ చార్జెస్ కలుపుకొని 300 వరకు అమ్ముతున్నారు. అయితే.. ధరలు పెరిగినా చికెన్ మీద ఉన్న ప్రేమతో తినక తప్పడం లేదంటున్నారు పబ్లిక్. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రతల పెరగడంతో తట్టుకోలేక కోళ్లు చనిపోతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు.

జిల్లాలో చిన్న ఫాంలు ఇప్పటికే మూతపడ్డాయని అంటున్నారు. దీంతో హైదరాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి కోళ్లు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. దాణా ధరలు కూడా ఇబ్బందిగా మారాయంటున్నారు. కోడిగుడ్డు ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం హోల్ సెల్ లో ఒక్క గుడ్డు 4నుండి 5 రూపాయలు పలుకుతోంది. కొన్ని చోట్ల 6 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఇవి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. మటన్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి. నిన్నమొన్నటి వరకు కిలో మటన్ 600లోపే ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మేక మాంసం 7 వందల రూపాయలు దాటింది. గొర్రె మాంసానికి మరింత ఎక్కువే వసూలు చేస్తున్నారు. దీంతో మటన్ దుకాణాలు కూడా గిరాకీ లేక వెలవెలబోతున్నాయి.  ఓ వైపు సమ్మర్ ఎఫెక్ట్ తో కూరగాయల ధరలు పెరిగిపోయాయి. దీనికి తోడు.. ఇప్పుడు మాంసం ధరలు కూడా పెరగడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. 

మరిన్ని వార్తల కోసం..

నేను ముత్యాల ముగ్గు హీరోయిన్.. రేవంత్ రెడ్డి విలన్

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ బాధితురాలి పరిస్థితి విషమం