
- 17 శాతం వరకు ధరలు జంప్
న్యూఢిల్లీ : రోజూవాడే సబ్బులు, పేస్టులు, షాంపూల వంటి ఎంఫ్సీజీ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. గత 2–-3 నెలల నుంచి నెలవారీ షాపింగ్ బిల్లులు భారంగా మారాయి. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలు ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 2 నుంచి 17శాతం పెంచాయి. సబ్బులు బాడీ వాష్ ల ధరలు 2–-9 శాతం, హెయిర్ ఆయిల్స్ రేట్లు 8-–11శాతం ఎంపిక చేసిన ఆహార పదార్థాల రేట్లు 3-–17శాతం పెరిగాయి. దాదాపు ఏడాది తర్వాత ధరలను పెంచుతున్నామని కంపెనీలు అంటున్నాయి.
అధిక ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా లాభాల మార్జిన్‌లను కొనసాగించడానికి 2022, 2023 ప్రారంభంలో ధరలను పెంచిన ఎఫ్ఎంసీజీ కంపెనీలు 2023లో ధరల పెంపును నిలిపివేశాయి. అయితే ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ముడి పామాయిల్ ధరలలో క్షీణత ఉన్నప్పటికీ, పాలు, చక్కెర, కాఫీ, ఎండుకొబ్బరి, బార్లీ వంటి ఇతర వర్గాల వస్తువుల ధరలు పైకి వెళ్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీ మారికో కొన్ని హెయిర్ ఆయిల్ ప్యాక్‌లపై ధరలను ఇప్పటికే 6శాతం ధరలను పెంచింది. ఎండు కొబ్బరి ధర మరింత పెరిగితే మరో రౌండ్ ధరలను పెంచవచ్చని తెలుస్తోంది.
స్నాక్స్ తయారీదారు బికాజీ 2024-–25 ఆర్థిక సంవత్సరంలో ధరలను 2-–4శాతం పెంచాలని యోచిస్తోంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్.. తన పోటీదారులతో సమానంగా ధరలను పెంచడం ప్రారంభించింది. మార్కెట్ లీడర్ హిందుస్తాన్ యూనిలీవర్ 2023-–24 ఆర్థిక సంవత్సరంలో ధరలను పెంచలేదు. డాబర్ ఇండియా, ఇమామీ కూడా ప్రస్తుత సంవత్సరంలో సింగిల్డిజిట్లోపే ధరలను పెంచాయి.
ఏ కంపెనీ ఎంత పెంచిందంటే...
- గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కొన్ని సబ్బుల ధరలను 4–-5శాతం పెంచగా, హిందుస్థాన్ యూనిలీవర్ డోవ్ సబ్బు ధరలను 2శాతం పెంచగా, విప్రో సంతూర్ ధరను 3శాతం పెంచింది.
- కోల్‌గేట్ పామోలివ్ బాడీ వాష్ ధర సింగిల్ డిజిట్‌లలో పెరిగింది. అయితే పియర్స్ బాడీ వాష్ ధర 4శాతం పెరిగింది.
- హెచ్‌యూఎల్, ప్రోక్టర్ అండ్ గాంబుల్, జ్యోతి ల్యాబ్స్ డిటర్జెంట్ బ్రాండ్‌ల ఎంపిక చేసిన ప్యాక్‌లపై 1-–10శాతం ధరలను పెంచాయి.
- హెచ్‌యూఎల్ తన షాంపూల ధరలను సింగిల్ డిజిట్‌లో పెంచింది. చర్మ సంరక్షణ ఉత్పత్తులపై ధరలను 4శాతం వరకు పెంచింది.
- కాఫీ ద్రవ్యోల్బణం కారణంగా నెస్లే ధరలను 8–-13శాతం పెంచింది. మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధర 1–7శాతం పెరిగింది. ఐటీసీ ఆశీర్వాద్ హోల్ వీట్ ధరలు సింగిల్ డిజిట్‌లో పెరిగాయి. మరికొన్ని ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచాయి.