ఒకవైపు ఎండ సుర్రుమంటుంటే.. మరోవైపు నీడలో కూర్చున్నా చెమటలు కారుతున్నాయి. ఇలాంటి టైంలో ఇంటి నుంచి అడుగు బయట పెట్టడం ఆలస్యం.. కాసేపట్లో ఒంట్లో నీళ్లన్నీ ఆవిరైపోతాయి. ఆ ఎఫెక్ట్ కేవలం డీ హైడ్రేషన్‌కి మాత్రమే గురిచేయట్లేదు... ఇతర అనారోగ్యాలకూ దారితీస్తోంది. ముఖ్యంగా ఈ వేసవిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన శరీరాన్ని లోపల నుంచే ఎండబెడుతున్నాయి! చెమట రూపంలో బయటకు వెళ్లిపోతున్న నీటిని తిరిగి భర్తీ చేయకపోతే, ఆ లోటు మొదటగా ప్రభావం చూపేది కిడ్నీలపైనే. అందుకే తస్మాత్ జాగ్రత్త! అని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్.
వేసవి మొదలైతే ఆసుపత్రుల్లో యూరాలజీ సమస్యలతో వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోందని డాక్టర్లు చెప్తున్నారు. నడుము పక్క భాగంలో తీవ్రమైన నొప్పి, మూత్రంలో మంట, ఇన్‌ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు... ఇవన్నీ ఇప్పుడు సాధారణ సమస్యల్లా మారుతున్నాయి. ఒకప్పుడు అరుదుగా వినిపించిన కిడ్నీ రాళ్ల సమస్య ఇప్పుడు చాలామందికి జీవితంలో ఏదో ఒక దశలో ఎదురవుతోంది అంటున్నారు. అయితే ఇది ఒక్కరోజులో తలెత్తే సమస్య కాదు. ప్రతిరోజూ తాగాల్సిన నీటిని వాయిదా వేయడం, దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగడం, ఎండలో పని చేసిన తర్వాత కూడా ద్రవాలు తీసుకోకపోవడం.. ఇలాంటి చిన్న నిర్లక్ష్యాలే పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయి. నిజానికి దాహం వేస్తోంది అంటే.. అప్పటికే శరీరం డీ హైడ్రేషన్‌లోకి వెళ్లిపోయి ఉంటుంది. ఆ టైంలో కిడ్నీలు మరింత ఒత్తిడికి గురవుతాయి.
చెమట రూపంలో నీరు ఆవిరి..
ఎండాకాలం శరీరం చెమట రూపంలో అధికంగా నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోయి మూత్రం చిక్కబడుతుంది. ఈ పరిస్థితుల్లో మూత్రంలో ఉండే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు స్ఫటికాలుగా మారి క్రమంగా కిడ్నీలో రాళ్లుగా ఏర్పడతాయి. నీళ్లు తక్కువగా తాగితే శరీరంలోని బ్యాక్టీరియా బయటకు వెళ్లకుండా నిల్వ ఉండటంతో మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా మహిళలు, మధుమేహంతో బాధపడేవాళ్లు, ప్రోస్టేట్ సమస్యలతో ఉన్న పురుషులు మరింత జాగ్రత్తగా ఉండాలి.
వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో..
మన దేశంలో ప్రతి వంద మందిలో సుమారు12 మందికి జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీ రాళ్ల సమస్య వచ్చే అవకాశముందని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే, వేడి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ సమస్య మరింతగా కనిపిస్తోందంటున్నారు డాక్టర్లు. చాలామంది దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతుంటారని, కానీ దాహం వేస్తోందంటే అప్పటికే శరీరం డీహైడ్రేషన్‌లోకి వెళ్లిందని అర్థం చేసుకోవాలంటున్నారు.
వేసవి ఎఫెక్ట్ పూర్తిగా తప్పించుకోలేకపోయినా, జాగ్రత్తలతో కంట్రోల్ చేయొచ్చు. శరీరం ఇచ్చే సంకేతాలను గమనించడం, దాహం కాకముందే నీళ్లు తాగడం, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించడం.. ఇవే కిడ్నీలను కాపాడే మార్గాలు. మండే ఎండల మధ్య ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది.
జాగ్రత్తలతోనే రక్షణ
ఈ సమస్యలకు పరిష్కారం.. రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగడం, బయటకు వెళ్తే వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లడం, పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరినీళ్లు వంటి ఆహారం తీసుకోవడం. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు ఉండకపోవడం మంచిది. చెమట ఎక్కువగా పడుతుంటే నీళ్లు లేదా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోవాలి.
జీవనశైలి కూడా కారణమే
మన ఆహార అలవాట్లు కూడా ఈ సమస్యలను పెంచుతున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, బయట ఫాస్ట్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలపై అదనపు భారం పడుతుంది. చల్లని పానీయాల పేరుతో తాగుతున్నవి తాత్కాలికంగా దాహం తగ్గించినా, శరీరానికి అవసరమైన ద్రవాలను సరైన విధంగా అందించవు.
కిడ్నీలో రాళ్లుంటే..
కిడ్నీలో రాళ్లు తయారయ్యే క్రమంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒక్కసారిగా నడుము పక్క భాగంలో తట్టుకోలేని నొప్పి మొదలవుతుంది. మూత్రంలో మంట, కొన్ని సందర్భాల్లో రక్తం కూడా కనిపిస్తుంది. తరచూ మూత్రం రావడం లేదా పూర్తిగా తగ్గిపోవడం, వాంతులు, అలసట, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
ప్రత్యామ్నాయం నీళ్లే..
డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు చాలామంది కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు తాగితే సరిపోతుంది అనుకుంటారు. కానీ దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. డీ హైడ్రేషన్‌కు ప్రత్యామ్నాయం నీళ్లు మాత్రమే. కెఫిన్, ఎక్కువ చక్కెర ఉండే పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ మరింత పెరుగుతుంది. పైగా ఇవి కొన్ని సందర్భాల్లో స్టోన్ ఫార్మేషన్‌కు దారితీసే మెటబాలిక్ మార్పులను ప్రోత్సహిస్తాయి. కాబట్టి ఒక్కటే రిలీఫ్.. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగడమే.
అధిక ఉప్పు ఉన్న ఆహారం వద్దు
కిడ్నీ రాళ్లకు కేవలం నీళ్లు తక్కువ తాగడం మాత్రమే కారణం కాదు. వేసవిలో అధిక ఉప్పు ఉన్న ఆహారం కూడా కిడ్నీ సమస్యలకు దారితీస్తుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తీసుకోవడం, బయటి ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి కూడా కిడ్నీ సమస్యలకు కారణం. ఎండాకాలంలో కిడ్నీ సమస్యలతో మా దగ్గరకు వచ్చే రోగుల సంఖ్య పెరగడానికి కారణాలివే.
-అల్లకొండ రాజశేఖర్
