వెలుగు ఓపెన్ పేజీ..పేద, మధ్యతరగతికి భారంగా.. మారిన ఆడంబరాలు

వెలుగు ఓపెన్ పేజీ..పేద, మధ్యతరగతికి భారంగా.. మారిన ఆడంబరాలు

భారతదేశంలో  ముఖ్యంగా  తెలుగు సమాజంలో  పెండ్లి  అనేది  ఒక శుభకార్యం  మాత్రమే కాదు,  ఇది ఒక కుటుంబానికి ఆర్థిక పరీక్షగా చెప్పవచ్చు.  ఆనందంగా  జరగాల్సిన వివాహం  నేడు  చాలా కుటుం బాలకు అప్పుల కథగా  మారుతోంది. సంప్రదాయం  పేరుతో  పెరిగిన ఖర్చులు,  ప్రతిష్ట పేరుతో సాగుతున్న  పోటీ,  పెళ్లి వ్యయాన్ని నియంత్రణ తప్పేలా చేస్తున్నా యి.  

ఒకప్పుడు  పెళ్లి అంటే  పందిరి,  పూజారి, బంధువులు,  బాజాభజంత్రీలు, మంగళ వాయిద్యాలతో  పెండ్లి తంతు ముగిసేది.  శుభకార్యాల సమయాలలో బంధువులు  ఇరుగు పొరుగు వారి సహాయంతో  పెళ్లి పనులు,  ఇతర పనులు చేయటం వల్ల కొంత ఉపశమనం ఉండేది.  కానీ, దాని స్థానంలో ఈ మధ్యకాలంలో  ఈవెంట్  మేనేజర్లు,  క్యాటరింగ్  సర్వీసు వంటివి  గ్రామీణ ప్రాంతాల్లో  కూడా  విస్తరిం చడం వల్ల పెండ్లి ఖర్చు పెరుగుతున్నది. 

ఒకప్పుడు హల్దీ ఫంక్షన్ అంటే.. ఇంటి పెద్దల సమక్షంలో పసుపు- నూనెతో సాదాసీదాగా  జరిగేది.  కుటుంబ సభ్యులు దగ్గరి బంధువులు పాల్గొనే  ఈ  కార్యక్రమం  ప్రధానంగా ఆశీర్వాదాలకు,  ఆనందానికి మాత్రమే పరిమితం అయ్యేది.  కానీ, కాలం మారింది.  ఇప్పుడు  హల్దీ  వేడుక ఖర్చుల పండుగగా  మారింది. 

లైక్స్, షేర్స్, వ్యూస్ కోసం...

పబ్లిక్ ప్రదేశాల్లో తీసే ప్రీ–వెడ్డింగ్ షూట్‌లలో  హద్దులు  దాటిన  సన్నిహిత దృశ్యాలు,  అసహజమైన శారీరక  భంగిమలు,  అసభ్య సంకేతాలు, ఇవన్నీ ‘కళ’ లేదా ‘క్రియేటివిటీ’ పేరుతో సమర్థించుకుంటున్నారు. నిజానికి ఇవి వ్యక్తిగత గౌరవాన్ని,  సమాజ  మర్యాదలను  ప్రశ్నించే అంశాలుగా మారుతున్నాయి.  ముఖ్యంగా  సోషల్ మీడియా ఈ ధోరణిని మరింతప్రోత్సహిస్తోంది.   లైక్స్, షేర్స్,  వ్యూస్ కోసం చేసే పోటీ..  యువతను అవసరం లేని అతి ప్రదర్శన దిశగా నడిపిస్తోంది.  

ఒకప్పుడు  కుటుంబ ఆల్బమ్‌లలో  మాత్రమే ఉండే  ఫొటోలు,  ఇప్పుడు  బహిరంగ వేదికలపై  ప్రదర్శించడంతో  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇది  దంపతులకే  కాకుండా  వారి కుటుంబాలకు కూడా అసౌకర్యాన్ని కలిగించే పరిస్థితిని సృష్టిస్తోంది.   వివాహం అనేది, ఒక బాధ్యతగా,  పరస్పర  గౌరవంగా,  సహనం అనే విలువలపై ఆధారపడాలి.  

కానీ,  షూట్‌లలో  చూపించే అతి రొమాన్స్, కృత్రిమ భావోద్వేగాలు  వివాహాన్ని  ఒక ప్రదర్శనగా మాత్రమే చూపిస్తున్నాయి.  దీని వల్ల వివాహ వ్యవస్థపై అవగాహన వక్రీకృతంగా మారే ప్రమాదం ఉంది.  ప్రీ–వెడ్డింగ్ షూట్స్​కు పూర్తిగా వ్యతిరేకం కావాల్సిన అవసరం లేదు. కానీ,  అవి సహజత్వం, గౌరవం,  సంస్కృతి  అనే  మూలసూత్రాలను   పాటించే విధంగా ఉండాలి.

సంస్కృతిని గౌరవించాలి

నేటి  పెళ్లిళ్లలో  వేదమంత్రాల కంటే  కెమెరా క్లిక్‌లే  ఎక్కువగా వినిపిస్తున్నాయి. పెళ్లి మంటపం  పవిత్రతకు  ప్రతీకగా ఉండాల్సిన చోట  ఇప్పుడు అది ఒక లైవ్ స్టూడియోలా మారుతోంది.  ఒకప్పుడు పెళ్లి అనేది  సహజమైన భావోద్వేగాల  ప్రవాహం.  ఇప్పుడు  అది కనుమరుగు అవుతోంది.   ఫొటోలు  జ్ఞాపకాల కోసం అవసరమే.  

కానీ,  జ్ఞాపకాల  పేరుతో  పెళ్లి  సహజత్వాన్ని   కోల్పోవడం  ప్రమాదకరం.  మంత్రోచ్ఛారణల మధ్యలో   కెమెరా  కోణాల  కోసం కలిగే  అంతరాయాలు,  ఆచారాల  గౌరవానికే   భంగం కలిగించేలా ఉండకూడదు.  ఇది కేవలం  ఒక వృత్తి  సమస్యగా  కాకుండా ఒక సాంస్కృతిక  విపరిణామంగా గుర్తించాలి.  ఫొటోగ్రాఫర్‌లు  తమ  నైపుణ్యంతోపాటు  సంస్కృతి పట్ల గౌరవం  చూపించాలి.  

ముఖ్యంగా  బరాత్‌లో  హంగామా,  వివాహాల్లో  మద్యం  వినియోగం అనే అంశాలు  గంభీరమైన సామాజిక ఆలోచనకు దారి తీస్తున్నాయి.  బరాత్ అనేది ఆనందాన్ని పంచుకునే కుటుంబోత్సవం. కానీ నేడు అది  డీజే శబ్దాల  మోత, నృత్యాల  ప్రదర్శనగా మారుతోంది. వ్యక్తిగత  ఆనందం పేరుతో  ప్రజాశాంతిని భంగం చేయడం ఎంతవరకు  సమంజసం అన్న ప్రశ్నకు సమాధానం  ఎంతైనా అవసరం. 

బరాత్‌లోనే  కాకుండా,  పెళ్లి వేదికల దగ్గర కూడా మద్యం ‘ఆతిథ్యం’గా మారింది.  దీని ఫలితం అనవసర  వాగ్వాదాలు,  ఘర్షణలు,  కొన్నిసార్లు వివాహాలే  భగ్నమైన సందర్భాలు ఉన్నాయి.   ఆధునికత పేరుతో  సంస్కృతిని  త్యజించడం పురోగతి కాదు.  కుటుంబాలు, సమాజ పెద్దలు,  యువత  ఈ మార్పుపై  పునరాలోచించాలి.

 మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి

నేటి పరిస్థితుల్లో  హల్దీ ఫంక్షన్ అంటే..  థీమ్- డెకరేషన్,  కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక దుస్తులు,ఫొటో షూట్లు,  డ్రోన్ కెమెరాలు,  లైవ్ మ్యూజిక్ వంటి అంశాలు తప్పనిసరిగా మారాయి.  పసుపు పూసే  కార్యక్రమం  కంటే,  ఈ  హల్దీ  కార్యక్రమానికి  ఎంత ఖర్చుపెట్టాం అనేది  చర్చగా  నిలుస్తోంది.  లక్షల రూపాయల  ఖర్చులతో  జరిగే  హల్దీ  వేడుకలు  మధ్యతరగతి  కుటుంబాలపై  ఆర్థిక ఒత్తిడిని పెంచుతున్నాయి.  ఈ  సంస్కృతి  గతంలో ఉన్నత  కుటుంబాలలో  మాత్రమే ఉండేది.  

కానీ,  ఈ మధ్యకాలంలో  గ్రామీణ ప్రాంతాల్లో కూడా  ఈ  తంతు  జరగడం  పరిపాటిగా  మారింది.   ఈ మధ్యకాలంలో  వివాహంలో  వచ్చిన  వింత సంస్కృతిలో ఒకటి.. ప్రీ వెడ్డింగ్ షూట్ అనే ఖరీదైన  ప్రదర్శన.     గ్రామీణ ప్రాంతాల్లో కూడా  నూతన వధూవరుల ప్రీ  వెడ్డింగ్ షూట్స్​ జరుగుతున్నాయి.    

వధూవరులు  ఫొటోగ్రాఫర్లు  చెప్పినవిధంగా వింత-వింత ఫోజులు  పెట్టి ఒక సినిమాటిక్  తరహాలో ప్రదర్శనలు చేస్తున్నారు. ఆధునికత,   గ్లోబలైజేషన్  ప్రభావంతో  యువతలో  వ్యక్తిగత స్వేచ్ఛపై  అవగాహన పెరిగింది. ఇది ఒక మంచి మార్పే.  అయితే,  అదే స్వేచ్ఛను  అతిగా మార్చుకోవడం సమస్యగా మారుతోంది. 

-  డా. ఎ. శంకర్