నీళ్ల పంచాయతీ..కృష్ణా,గోదావరి బోర్డుల మీటింగ్‌‌లో వాదనలు

నీళ్ల పంచాయతీ..కృష్ణా,గోదావరి బోర్డుల మీటింగ్‌‌లో వాదనలు
  • అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలన్న ఏపీ
  • ట్రిబ్యునల్‌‌ అవార్డు తేలేవరకుకుదరదన్న తెలంగాణ
  • బోర్డును ఏపీకి తరలించేప్రతిపాదనపై అభ్యంతరం
  • గతంలో మాదిరిగానే ఏపీకి 66 %, తెలంగాణకు34 % నీటి పంపకాలు
  • త్రీమెన్‌‌ కమిటీ సమావేశం వాయిదా

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మీటింగ్‌‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ ఇంజనీర్ల మధ్య వాడివేడి వాదనలకు వేదికగా మారింది. శుక్రవారం జలసౌధలో బోర్డు చైర్మన్‌‌ ఆర్‌‌కే గుప్తా అధ్యక్షతన సమావేశం జరిగింది. బేసిన్‌‌ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తేవాలంటూ ఏపీ డిమాండ్‌‌ చేసింది. ఈ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. కృష్ణా వాటర్‌‌ డిస్ప్యూట్స్‌‌ ట్రిబ్యునల్‌‌-2 అవార్డు తేలకుండా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులను తెచ్చే ఆస్కారమే లేదని తేల్చిచెప్పింది. ఏపీ అసంబద్ధమైన వాదన చేస్తోందని మండిపడింది. కనీసం నాగార్జునసాగర్‌‌ కుడికాలువ పైనైనా తమకు హక్కులు కల్పించాలని ఏపీ కోరింది. ఆ డిమాండ్‌‌నూ తెలంగాణ తోసిపుచ్చింది. సాగర్‌‌ కుడికాలువపై తమ రాష్ట్రానికి పూర్తిస్థాయిలో హక్కుల్లేకుంటే, ఏపీలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, తమ రాష్ట్ర సమస్యను పరిగణనలోకి తీసుకోవాలని అక్కడి ఇంజనీర్లు బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ ఇప్పటికే కుడి కాలువ నుంచి కేటాయించిన దానికంటే ఎక్కువ నీటిని వాడుకుంటోందని, హక్కులిస్తే తెలంగాణకు నష్టమని ఇక్కడి ఇంజనీర్లు వ్యతిరేకించారు. తెలంగాణ ఇంజనీర్ల అభ్యంతరాలతో ప్రాజెక్టులపై బోర్డుకు హక్కుల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ముఖ్యమంత్రుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. కృష్ణా నదిలో లభ్యమయ్యే నీటిని గతేడాది మాదిరిగానే ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతంగా కేటాయించాలని నిర్ణయించారు. నీళ్ల కేటాయింపులో ఎగువ నుంచి వచ్చే వరద, ఇరు రాష్ట్రాల నీళ్ల డిమాండ్‌‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి.

ఇరు రాష్ట్రాల ఇండెంట్లు అందజేత

ఆగస్టు నుంచి నవంబర్‌‌ వరకు  నాలుగు నెలలకు 103 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ కోరగా, తమకు ఒక్క నెల కోసం 38 టీఎంసీలు ఇవ్వాలని ఏపీ ఇండెంట్‌‌ ఇచ్చింది. నాగార్జున సాగర్‌‌ ఎడమ కాలువకు 50 టీఎంసీలు, శ్రీశైలం ఎడమ కాలువకు 20 టీఎంసీలు, కల్వకుర్తికి 25 టీఎంసీలు, హైదరాబాద్‌‌ మెట్రోవాటర్‌‌ వర్క్స్‌‌కు 4 టీఎంసీలు, మిషన్‌‌ భగీరథకు 4 టీఎంసీలు ఇవ్వాలని తెలంగాణ ఇంజనీర్లు ఇండెంట్‌‌ అందజేశారు. పోతిరెడ్డిపాడుకు 23 టీఎంసీలు, సాగర్‌‌ కుడి కాలువకు 10 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతికి 5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ కోరింది. ఇరు రాష్ట్రాల ఇండెంట్లపై త్రీమెన్‌‌ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని బోర్డు అభిప్రాయపడింది. బోర్డు చైర్మన్‌‌, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో కూడిన త్రీమెన్‌‌ కమిటీ శుక్రవారమే భేటీ అయి నీటి కేటాయింపులను తేల్చాల్సి ఉండగా, శ్రీశైలం గేట్లు ఎత్తి సాగర్‌‌లోకి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో పది రోజుల తర్వాత సమావేశమైతే అందుబాటులో ఉన్న నీళ్లెన్నో తేలుతాయని, అప్పుడే భేటీ కావాలని నిర్ణయించి సమావేశాన్ని వాయిదా వేశారు.

బోర్డును ఏపీకి తరలించొద్దు: సోమేశ్​

ఆంధ్రప్రదేశ్‌‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాల్సి ఉందని బోర్డు చైర్మన్‌‌ పేర్కొనగా దాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ స్పెషల్‌‌ సీఎస్‌‌ సోమేశ్‌‌కుమార్​ వ్యతిరేకించారు. కృష్ణా బోర్డును హైదరాబాద్‌‌లోనే కొనసాగించాలని ఆయన కోరారు. బోర్డును తరలించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చెప్తోందని చైర్మన్‌‌ పేర్కొనగా.. కేంద్ర మంత్రిత్వ శాఖతో తాము మాట్లాడుతామని సోమేశ్‌‌ బదులిచ్చారు. బోర్డును ఇక్కడి నుంచి తరలించేది లేదని, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖతో తమ ప్రభుత్వం ఈమేరకు చర్చలు జరుపుతుందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. వీలైనంత తర్వగా తొమ్మిది ప్రాంతాల్లో కొత్త టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేస్తామని బోర్డు చైర్మన్​ తెలిపారు.

కేంద్రం నిర్ణయం మేరకే : బోర్డు చైర్మన్​

బోర్డుకు నిధుల విడుదల, ఇరు రాష్ట్రాలకు నీటి పంపిణీపై చర్చించామని సమావేశం అనంతరం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌‌ ఆర్‌‌కే గుప్తా తెలిపారు. సానుకూలంగా చర్చలు జరిగాయని, అన్ని అంశాలపై చర్చించామన్నారు. బోర్డును హైదరాబాద్‌‌లోనే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరిందని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు నివేదించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటామని, తామైతే విభజన చట్టం ప్రకారమే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను ఆపాలి

హైదరాబాద్‌‌, వెలుగు:  కాళేశ్వరం, సీతారామ, తుపాకులగూడెం, దుమ్ముగూడెం అక్రమ ప్రాజెక్టులని, వాటిని నిలిపివేయాలని ఏపీ ఇంజనీర్లు గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్​ఎంబీ) సమావేశంలో డిమాండ్‌‌ చేశారు. ఇక్కడ నిర్మిస్తున్నవన్నీ ఉమ్మడి ఏపీలో డిజైన్‌‌ చేసినవేనని, అవేవి కొత్త ప్రాజెక్టులు కాదని వారి వాదనను రాష్ట్ర ఇంజనీర్లు తిప్పికొట్టారు. శుక్రవారం హైదరాబాద్​లోని జలసౌధలో బోర్డు చైర్మన్‌‌ ఆర్‌‌కే జైన్‌‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం 451.31 టీఎంసీలతో కొత్త ప్రాజెక్టులను చేపట్టిందని వాటికి బోర్డు, అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి లేదని ఏపీ ఇంజనీర్లు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాజెక్టులను వెంటనే ఆపాలని డిమాండ్​ చేశారు. అయితే.. ప్రాణహిత – చేవెళ్లను రీ డిజైన్​ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని సీడబ్ల్యూసీ సహా అన్ని అనుమతులు వచ్చాయని రాష్ట్ర ఇంజనీర్లు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ఇందిరాసాగర్‌‌, రాజీవ్‌‌ సాగర్‌‌లను రీ డిజైన్‌‌ చేసి నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టే తుపాలకుగూడెం అని, దుమ్ముగూడెంను ఉమ్మడి ఏపీలో ప్రారంభించామని వివరించారు. ఏపీనే పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించి ఉపయోగించుకుంటోందని, ప్రత్యామ్నాయంగా కృష్ణా నీళ్లలో తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వడం లేదని  తెలంగాణ ఇంజనీర్లు తెలిపారు. లోయర్‌‌ సీలేరు పవర్‌‌ ప్రాజెక్టును ఏపీ అన్యాయంగా గుంజుకొని కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని వారు బోర్డు దృష్టికి తెచ్చారు. ఒడిశా ప్రభుత్వం నిర్మిస్తున్న మిడ్‌‌ కొలాబ్‌‌ ప్రాజెక్టుపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఇంజనీర్లు తమ అభ్యంతరాలను తెలిపారు. ఏపీ ప్రభుత్వం గోదావరి నీళ్లను చింతలపూడి ప్రాజెక్టు ద్వారా పెన్నా డెల్టాకు తరలిస్తున్నదని, ఈ మేరకు తెలంగాణ జరిగే నష్టాన్ని పూడ్చాలని రాష్ట్ర ఇంజనీర్లు కోరారు. పోలవరం నిర్మాణం పూర్తయితే బ్యాక్‌‌ వాటర్‌‌తో భద్రాచలం రామాలయం సహా, పట్టణం మునిగిపోయే ప్రమాదముందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది.

లింక్​ ప్రతిపాదన రాలేదు: ఆర్‌‌కే జైన్‌‌

సమావేశం ముగిసిన తర్వాత బోర్డు చైర్మన్‌‌ ఆర్‌‌కే జైన్‌‌ మీడియాతో మాట్లాడారు. బోర్డు వర్కింగ్‌‌ మ్యానువల్‌‌, అడ్మినిస్ట్రేటివ్‌‌, టెక్నికల్‌‌ ఇష్యూస్‌‌, ఆన్‌‌గోయింగ్‌‌, కొత్త ప్రాజెక్టులపై చర్చించామన్నారు. గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌‌కు తరలించే ప్రతిపాదనేది బోర్డు దృష్టికి రాలేదని, అలాంటి ప్రతిపాదన తమ దృష్టికి వస్తే చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బోర్డుకు ఇరు రాష్ట్రాలు సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయాలని కోరామన్నారు. ఏపీ ఇరిగేషన్‌‌ కార్యదర్శి సమావేశానికి రాకపోవడంతో ప్రధాన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించలేదని ఆయన తెలిపారు. తర్వాత జరిగే సమావేశంలో ఈ అంశాలపై చర్చిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్‌‌ స్పెషల్‌‌ సీఎస్‌‌ సోమేశ్‌‌కుమార్‌‌, ఈఎన్సీలు మురళీధర్‌‌, వెంకటేశ్వర్‌‌రావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.