నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో సంప్రదింపులు

నదుల అనుసంధానంపై రాష్ట్రాలతో సంప్రదింపులు
  • కేంద్ర బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ వెల్లడి

హైదరాబాద్‌, వెలుగు: గోదావరి–కావేరి నదుల అనుసంధానం మళ్లీ తెరపైకి వచ్చింది. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపడ్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో వెల్లడించారు. దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ డీపీఆర్ సిద్ధం చేసి ఆయా రాష్ట్రాలకు పంపామని, నదుల అనుసంధానంపై సభ్య రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

గోదావని నదిపై తెలంగాణ లోని ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 247 టీఎంసీల ను  కృష్ణా (నాగార్జునసాగర్‌), పెన్నా (సోమశిల), గ్రాండ్‌ ఆనికట్‌ (కావేరి) కు తరలించాలని డీపీఆర్ రూపొందించారు. ఎన్ డబ్ల్యూడీఏ డీపీఆర్ పై ఇప్పటికే రాష్ట్రాలతో రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది. ఇచ్చంపల్లి వద్ద నదిలో 324 టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టుగా పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం చెప్తోంది. గోదావరి–కావేరి లింక్‌లో భాగంగా తరలించే 247 టీఎంసీల్లో 70 టీఎంసీలు ఛత్తీస్‌గఢ్‌ వాటా ఉందని గుర్తు చేస్తోంది. ఇంద్రావతిపై తాము ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, అలాంటప్పుడు మిగులు జలాలే ఉండవని ఛత్తీస్ గఢ్ వాదిస్తోంది. ఈ లింక్ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ లో 58 వేల హెక్టార్లకు, ఏపీలో 2.07 లక్షలు, తమిళనాడు లో 1.65 లక్షల హెక్టార్లకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రూ.60,361 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. నేషనల్ ప్రాజెక్టు గా చేపట్టనుండటంతో నిర్మాణ వ్యయంలో 60 శాతం కేంద్రం, మిగిలిన మొత్తం ఆయా రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ప్రాజెక్టు చేపట్టడంతో పాటు, ముందుగా మహానది (ఒడిశా) నుంచి గోదావరి కి లింక్ చేయాలని తెలంగాణ కోరుతోంది. బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదించంతో సంప్రదింపుల ప్రక్రియ వేగవంతం కానుంది.