నదులు, వాగులు వరదెత్తినయ్..! పొంగి పొర్లుతున్న గోదావరి, కృష్ణా, మంజీరా, మూసీ

నదులు, వాగులు వరదెత్తినయ్..! పొంగి పొర్లుతున్న గోదావరి, కృష్ణా, మంజీరా, మూసీ

మెదక్/పాపన్నపేట, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో పాటు ఎగువ నుంచి వరద వస్తుండడంతో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. గోదావరి, కృష్ణా, మంజీరా, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలపై నుంచి వరద పారుతుండడంతో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు కూడా వాగులు దాటొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటలు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. దీంతో నదులు, ఉపనదులు, వాగుల్లో చేపల వేటపై అధికారులు నిషేధం విధించారు. నాటు పడవల్లో ప్రయాణాలపైనా ఆంక్షలు పెట్టారు. 

 ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా ఉధృతి 

ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి లక్ష క్యూసెక్కులకుపైగా నీరు వస్తుండడంతో మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని ఘనపూర్ ఆనకట్టపై నుంచి నీరు పొంగి పొర్లుతోంది. ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయ మండపంపై నుంచి వరద వెళ్తుండగా గర్భగుడిలోకి నీరు చేరింది.

టెంపుల్ ప్రాంగణంలోని లడ్డూ, పులి ప్రసాదం కౌంటర్ కొట్టుకుపోయింది. ఏడుపాయల్లోని నది మొదటి బ్రిడ్జిపై నుంచి ప్రవాహం కొనసాగుతుండగా, రెండు, మూడో బ్రిడ్జిలను తాకుతూ ప్రవహిస్తోంది. ఏడుపాయల వెళ్లే రూట్లలో వాహనాల రాకపోకలకు నిలిపి వేశారు. మెదక్ జిల్లా కేంద్రానికి వచ్చిన ప్రజలు, ఉద్యోగులు చిక్కుకుపోయారు. 

 భద్రాచలం ఆలయంలోకి బ్యాక్ ​వాటర్​

భద్రాచలం వద్ద గోదావరికి వరద తగ్గుముఖం పట్టింది. గరిష్టంగా 46.60 అడుగులకు చేరుకోగా, శనివారం మధ్యాహ్నం నుంచి తగ్గుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బ్యాక్ వాటర్‎తో రామాలయం పడమర మెట్లు, అన్నదాన సత్రంలోకి వరద చేరింది. కరకట్ట వద్ద మోటార్లను సకాలంలో ఆన్​చేయక పోవడంతో విస్తా కాంప్లెక్స్, అన్నదాన సత్రం, పడమర మెట్లను ముంచెత్తింది.

 ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, దేవస్థానం ఈవో దామోదర్​రావు ఆలయ పరిసరాలను పరిశీలించారు. భద్రాచలం – -పేరూరు మార్గంలో దుమ్ముగూడెం మండలం బుర్రవేముల, తూరుబాకల వద్ద వరద రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచాయి. సాయంత్రం నుంచి తిరిగి పునరుద్ధరించారు. పర్ణశాల ఆలయం వద్ద సీతవాగు పొంగి సీతమ్మ నారచీరలు నీటమునిగాయి. విలీన ఆంధ్రా మండలాల్లో ఏటపాకలోని మురుమూరు వద్ద రోడ్డుపైకి వరద చేరడంతో  కూనవరం, వీఆర్​పురం మండలాలకు రవాణా బంద్ అయింది. 

భద్రాచలంలో స్నానఘట్టాలు, కల్యాణకట్ట వద్ద భక్తులు లోతుకు వెళ్లకుండా గజ ఈతగాళ్లను ఉండారు. దండకారణ్యం నుంచి చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు వరద వస్తుండడంతో 24 గేట్లను ఎత్తి 29,990 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులు తున్నారు. కలెక్టర్​జితేశ్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి.రాహుల్​, భద్రాచలం సబ్​కలెక్టర్​మృణాల్​శ్రేష్ఠలు వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.  భద్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లాలోని పోలీసుస్టేషన్లకు ఎస్పీ రోహిత్ రాజ్​ఆదేశాలు జారీ చేశారు.  

మూసీ ప్రాజెక్ట్ కు పోటెత్తిన వరద  ..9 గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల 

సూర్యాపేట: హైదరాబాద్​లోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెల్లోంచి భారీగా నీటిని విడుదల చేస్తుండడంతో మూసీ ప్రాజెక్టు వరద పోటెత్తుతోంది. శనివారం 41, 448 క్యూసెక్కులకు పైగా చేరుతుండడంతో ప్రాజెక్టులోని 9 గేట్లను 8 ఫీట్ల మేర, మరో గేటును6 ఫీట్ల మేర ఎత్తి 44,798 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు ప్రాజెక్ట్ డీఈ చంద్రశేఖర్ తెలిపారు. 
ప్రాజెక్టు గరిష్టస్థాయి నీటిమట్టం 645 ఫీట్లు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 643 ఫీట్లు (3.94 టీఎంసీలు) ఉంచినట్టు చెప్పారు. ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండడంతో అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నట్టు, దిగువ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈఈ వెంకటరమణ సూచించారు. 

యాదాద్రి జిల్లాలో..

ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో మూసీకి వరద తాకిడి పెరిగింది. యాదాద్రి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లో లెవల్ బ్రిడ్జిలు మునిగిపోయాయి. వలిగొండ మండలం సంగెంలోని భీమలింగం కత్వా వద్ద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. 

రోడ్డు పక్కనే ఉన్న భారీ శివలింగం కొట్టుకుపోగా.. టెంపుల్​మెట్లపై నుంచి వరద పారుతోంది. దీంతో  సంగెం-– రుద్రవెల్లి, బొల్లెపల్లి– ---సంగెం –---చౌటుప్పల్ రూట్, భూదాన్ పోచంపల్లి---– బీబీనగర్ మధ్యలో రాకపోకలు నిలిపి వేసి బారికేడ్లను పెట్టారు. భువనగిరి-– నల్గొండ రోడ్డులోని వలిగొండ బ్రిడ్జి వద్ద, భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు వద్ద నది ఉధృతంగా ఉంది.    

 సాగర్‌‌‌‌కు 4 లక్షల  క్యూసెక్కులకు పైగా ఇన్‌‌ఫ్లో 

శ్రీశైలం ప్రాజెక్ట్ తో పాటు ఎగువ నుంచి నాగార్జున సాగర్​కు 4,19,598 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 26 గేట్లను10 అడుగులు మేర ఎత్తి 3,76,402 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587.30 అడుగులు( 305.6838  టీఎంసీల)కు చేరింది. కుడి కాల్వకు 8,023, హైదరాబాద్ జంట నగరాల తాగునీటికిగాను ఏఎమ్మార్పీకి 2,400, వరద కాల్వకు 300, విద్యుత్​ఉత్పత్తికి 33,373 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.