- అతని ప్లేస్‌ను భర్తీ చేయలేమన్న రియాన్ పరాగ్
- కొత్త స్ట్రాటజీలతో ముందుకెళ్లనున్న రాయల్స్
జైపూర్: టీమిండియా సూపర్ స్టార్ సంజూ శాంసన్.. చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో ఏర్పడిన ఖాళీని పూర్తి చేయలేని రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. లెజెండ్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం ఎంత అసాధ్యమో.. శాంసన్ లోటును పూరించడం కూడా అంతే అసాధ్యమని స్పష్టం చేశాడు.
2021 నుంచి 2025 వరకు రాజస్తాన్‌కు నాయకత్వం వహించిన శాంసన్.. ప్రీ సీజన్ ఒప్పందంలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌కు ట్రేడ్ అయ్యాడు. ఈ డీల్‌లో రవీంద్ర జడేజా రాయల్స్ జట్టులోకి వచ్చాడు. ‘శాంసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ప్లేయర్ స్థానాన్ని భర్తీ చేయడం గురించి మేమెప్పుడూ ఆలోచించబోం. బహుశా అతనిలాంటి నైపుణ్యాలున్న ప్లేయర్ కోసం వెతకొచ్చు. లేదా అతని ప్లేస్‌లో బ్యాటింగ్ చేసే వారిని తీసుకోవచ్చు.
కానీ శాంసన్ ప్లేస్‌ను పూర్తిగా భర్తీ చేసే ప్లేయర్‌ను మాత్రం తీసుకురాలేం. కోహ్లీ, రోహిత్‌తో పాటు శాంసన్‌కు కూడా ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే సంజూ చాలా విలువైన మంచి ప్లేయర్’ అని పరాగ్ పేర్కొన్నాడు. రెండు విడతలుగా 11 ఏళ్ల పాటు రాజస్తాన్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన శాంసన్ విజయవంతమైన కెప్టెన్‌గా, అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఆర్‌ఆర్‌ను 2022 ఫైనల్‌కు, 2024లో ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. అయితే గత సీజన్‌లో పది పరాజయాలతో తీవ్రంగా నిరాశపర్చింది. ఫలితంగా పాయింట్ల టేబుల్‌లో పదో స్థానంతో సరిపెట్టుకుంది.
మెరుగైన స్ట్రాటజీతో..
శాంసన్ ప్లేస్‌లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన పరాగ్.. ఈసారి కొత్త స్ట్రాటజీతో ముందుకొస్తున్నామని చెప్పాడు. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల్లో గెలవడానికి మెరుగైన వ్యూహం, సరైన ప్రణాళిక అవసరమన్నాడు. ‘మ్యాచ్‌లను మెరుగ్గా ముగించడంపైనే ఈసారి ఎక్కువగా కసరత్తు చేస్తున్నాం. గత సీజన్‌లో మేం దాన్ని అనుసరించలేకపోయాం. సుమారు 56 మ్యాచ్‌ల్లో మేం చివరి ఓవరు లేదా చివరి బంతికి ఓడిపోయాం.
మేం వాటిని గెలిచినా, మెరుగ్గా ముగించినా...ఈ ప్రశ్న అడిగేవారు కాదు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ల్లో గెలిస్తే మేం నాకౌట్‌కు క్వాలిఫై అయ్యే వాళ్లం’ అని పరాగ్ వివరించాడు. ప్రతి టీ20 మ్యాచ్‌లోనూ ఆట గమనాన్ని మార్చే 34 నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ఆ చిన్న నిర్ణయాలను సరైన వ్యూహంతో, ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తామన్నాడు.
అనేక సీజన్ల పాటు ఇబ్బందులు ఎదురైనా తనపై నమ్మకం ఉంచినందుకు ఫ్రాంచైజీకి పరాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. మరోవైపు పరాగ్‌ను మంచి క్రికెటర్‌గా చూస్తానని రాయల్స్ క్రికెట్ డైరెక్టర్, హెడ్ కోచ్ కుమార సంగక్కర అన్నాడు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పరాగ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశామన్నాడు.
సీఎస్కే వైస్ కెప్టెన్‌గా సంజూ!
మెగా లీగ్ కోసం చెన్నైకి చేరుకున్న సంజూ శాంసన్‌కు అదిరిపోయే స్వాగతం లభించింది. అయితే ఈ సీజన్‌లో శాంసన్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించే చాన్సెస్ ఉన్నాయని మాజీ ప్లేయర్లు వెల్లడించారు. ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా కేవలం శాంసన్‌కే ఉందని మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నాడు. ‘ఇండియా క్రికెట్‌లో సునీల్ గావస్కర్ నుంచి సచిన్, ఆపై ద్రవిడ్, గంగూలీ, విరాట్ కోహ్లీ వరకు వారసత్వం ఎలా కొనసాగిందో ఇప్పుడు ధోనీ నుంచి ఆ బాధ్యతలను శాంసన్ అందుకోబోతున్నాడు. సంజూను జట్టులోకి తీసుకోవడం వ్యూహాత్మకమైన నిర్ణయం. అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ల వెనకాల కీపింగ్ చేస్తూ మ్యాచ్‌ను కూడా శాసించగలడు. రుతురాజ్ గైక్వాడ్‌కు సరైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఎందుకంటే సంజూకు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది’ అని కుంబ్లే స్పష్టం చేశాడు.
