నన్ను కొట్టేందుకు చెప్పు ఎత్తారు.. అసభ్యంగా తిట్టారని లాలూ కూతురు రోహిణి ఎమోషనల్

నన్ను కొట్టేందుకు చెప్పు  ఎత్తారు.. అసభ్యంగా తిట్టారని లాలూ కూతురు రోహిణి ఎమోషనల్
  • తేజస్వీ యాదవ్​పై పరోక్షంగా ఎక్స్​లో సంచలన పోస్టు 
  • రచ్చకెక్కిన లాలూ కుటుంబ గొడవలు

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్​యాదవ్​ ఇంట్లో గొడవలు తీవ్రమయ్యాయి. తనను కొట్టేందుకు చెప్పు ఎత్తారని లాలూ కూతురు రోహిణి ఆచార్య పేర్కొనడం తీవ్ర సంచలనం సృష్టించింది. అసభ్యకరమైన భాషలో దూషించారని సోదరుడు తేజస్వీ యాదవ్​పై పరోక్షంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఆత్మగౌరవాన్ని చంపుకొని ఉండలేక కుటుంబాన్ని, తల్లిదండ్రులను వదిలేసి నిస్సహాయంగా వెళ్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తండ్రికి కిడ్నీ ఇవ్వడంపైనా నీచంగా మాట్లాడారన్నారు. 

మీకు తోడబుట్టిన సోదరులు ఉంటే తండ్రి ప్రాణాలు కాపాడేందుకు మీరు ఎప్పుడూ మీ కిడ్నీ ఇవ్వకండని ఆడపిల్లలకు సూచించారు. బిహార్​లో ఆర్జేడీ దారుణ ఓటమి తర్వాత తాను రాజకీయాలను వదిలేస్తున్నానని శనివారం రోహిణి ప్రకటించిన సంగతి తెలిసిందే. తేజస్వీ అత్యంత సన్నిహితులు సంజయ్ యాదవ్, రమీజ్​ ఆలం​సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే తనను తీవ్రంగా అవమానించారంటూ ఆదివారం ‘ఎక్స్’​లో వరుసగా చేసిన పోస్టులు తీవ్ర చర్చకు దారితీసింది.

మీ నాన్నను ఎప్పుడూ కాపాడకండి..

మొదటి పోస్ట్ చేసిన గంటకే రోహిణి మరో పోస్టు చేశారు. ‘‘మా నాన్నను బతికించుకోవాలని కిడ్నీ ఇచ్చాను. కోట్ల రూపాయలు తీసుకొని ‘డర్టీ కిడ్నీ’ ఇచ్చి.. ఎంపీ టికెట్ పొందానని ఆరోపిస్తున్నారు. పెండ్లయిన ఆడపిల్లలకు నా అభ్యర్థన ఒకటే, మీ ఇంట్లో కొడుకు, సోదరుడు ఉంటే మీకు దైవ సమానుడైన తండ్రికి మీ కిడ్నీ అస్సలు ఇవ్వకండి. కిడ్నీ ఇచ్చే అవకాశం కొడుకులకే కల్పించండి. భర్త, అత్తామామల పర్మిషన్ తీసుకోకుండా నా తండ్రిని కాపాడేందుకు ఇచ్చిన కిడ్నీని ఇప్పుడు ‘డర్టీ కిడ్నీ’ అంటున్నరు” అని ఆమె పేర్కొన్నారు.

నా సోదరిని అవమానిస్తే సహించేది లేదు: తేజ్​ ప్రతాప్

రోహిణి చేసిన పోస్టులపై ఆమె మరో సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను కుటుంబం నుంచి, పార్టీ నుంచి బయటకు పంపారు. ఎన్నో మాటలు అన్నారు. సహించాను. రోహిణిపై చెప్పుతో దాడి చేయబోయారనే విషయం తెలిసి నా గుండె రగిలిపోతోంది. నా సోదరికి జరిగిన అవమానాన్ని భరించలేను. దీని పరిణామాలు భయంకరంగా ఉంటాయి” అని తేజ్ ప్రతాప్ ఎక్స్​లో పోస్టు చేశారు.