భాగల్పూర్: బిహార్‌ను బీడీలతో పోలుస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చాలాసార్లు అవమానించారని, అయినా కూడా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు స్టాలిన్ అంటే ఫేవరెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ‘‘మీకు ఏ సీఎం ఫేవరెట్ అని తేజస్విని ఎవరో అడిగితే, స్టాలిన్ అని ఆయన రిప్లై ఇచ్చారు.
బిహార్‌ను అవమానించేటోళ్లను తేజస్వీ అభిమానిస్తాడు” అని షా విమర్శించారు. శుక్రవారం బిహార్‌లోని భాగల్పూర్, జముయిలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆయన మాట్లాడారు. బిహార్‌లో అభివృద్ధి కొనసాగాలంటే ఎన్డీయే కూటమికి ఓటు వేయాలని కోరారు. మహాఘట్ బంధన్ కూటమి నేతలకు రాష్ట్ర అభివృద్ధిపై అజెండా లేదన్నారు. ‘‘మహాఘట్ బంధన్ కూటమి గెలిస్తే, బిహార్ లో మళ్లీ అల్లర్లు మొదలవుతాయి. కిడ్నాపులు సాధారణమవుతాయి.
గతంలో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్నపుడు పేదల కోసం ఏమీ చేయలేదు. చొరబాటుదారులను వారు పెంచి పోషించారు. సోనియా గాంధీ, లాలూప్రసాద్ యాదవ్‌కు తమ కొడుకులు, కూతుళ్ల సంక్షేమం తప్ప పేదల సంక్షేమం పట్టదు. మాకు మరో ఐదేళ్లు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో బిహార్‌ను చేరుస్తాం” అని షా పేర్కొన్నారు.
గయ, ఔరంగాబాద్, జముయితో పాటు పలు ప్రాంతాల నుంచి నక్సలిజాన్ని నిర్మూలించామని, ఇప్పుడు బిహార్‌లో ప్రశాంతత నెలకొందని చెప్పారు. తమ కూటమి గెలిస్తే, రాష్ట్రంలో సీతామాత టెంపుల్ నిర్మిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
