కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే బెయిల్ వచ్చింది

కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే బెయిల్ వచ్చింది

ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీంపూర్‌‌లో జరిగిన హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ రావడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.  వ్యవస్థలు నడుస్తున్న తీరునే ప్రశ్నించారు రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్​ జయంత్ సింగ్ చౌదరి. ‘‘ఇదేం వ్యవస్థ.. నలుగురు రైతుల్ని చంపేసిన నేతకు నాలుగు నెలల్లోనే బెయిల్ వచ్చింది?” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీని తప్పుబట్టిన ప్రియాంక

లఖీంపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా. ఒక వేళ ప్రధాని మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఆశిష్ మిశ్రా తండ్రి  అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. లఖీంపూర్ ఘటనలో నిందితుడి తండ్రి అయిన అజయ్ మిశ్రాను రాజీనామా చేయాలని ఎందుకు కోరలేదని నిలదీశారు. రైతుల మృతికి కారణమైన ఆశిష్ మిశ్రాకు బెయిల్ వచ్చిందని, ఇకపై అతడు స్వేచ్ఛగా తిరుగుతాడని అన్నారు. 

కేంద్ర మంత్రి కొడుకు కాబట్టే బెయిల్ వచ్చింది

లఖీంపూర్ ఘటన నిందితుడు ఆశిష్ మిశ్రా కేంద్ర మంత్రి కొడుకు కావడం వల్లనే ఈజీగా బెయిల్ వచ్చిందని సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్‌భర్ అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీకి అర్థమైపోయిందని,  అందుకే ఇప్పుడు ఆశిష్​ మిశ్రాకు బెయిల్ ఇవ్వడం ద్వారా బ్రహ్మణుల ఓట్లు పొందవచ్చని ఆ పార్టీ భావిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడికి బెయిల్ వచ్చిందని, కానీ ఘజియాపూర్‌‌ బోర్డర్, లఖీంపూర్‌‌లలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఓం ప్రకాశ్ అన్నారు.

అక్టోబర్ 9న అరెస్ట్

యూపీలోని లఖీంపూర్‌‌లో జరిగిన హింస ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3న మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లడంతో నలుగురు రైతులతోపాటు కారు డ్రైవర్, ఓ జర్నలిస్టు, మరో ఇద్దరు కలిపి మొత్తం 8 మంది చనిపోయారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడనే అభియోగంపై గత అక్టోబర్ 9న అరెస్టు చేశారు. ఘటన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది. అనంతర పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసింది.

మరిన్ని వార్తల కోసం..

పదేళ్లుగా సర్కారుకు కిరాయి కట్టని కాంగ్రెస్

ఇక తిరుపతిలో నేరుగా సర్వదర్శనం టోకెన్ల జారీ

ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల