
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఫెన్సింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారును ఆ కారు ఓనరే డ్రైవ్ చేస్తున్నాడు. ఈ ఘటనలో అతనికి గాయాలయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి తెలంగాణలో పలుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు విషాదం నింపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ఒక అడిషనల్ ఎస్పీ ప్రయాణిస్తున్న స్కార్పియో అదుపు తప్పి కైతాపురం దగ్గర డివైడర్ను ఢీ కొట్టింది. అటువైపుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో స్కార్పియో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు స్పాట్లోనే చనిపోయారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్కు, డ్రైవర్ నర్సింగ్ రావులకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరినీ పోలీసులు హాస్పిటల్కు తరలించారు. వీరు వీఐపీలకు భద్రత కల్పించే సెక్యూరిటీ వింగ్లో వర్క్ చేస్తున్నారు.
వీరి సీఐడీ కార్యాలయం హైదరాబాదులో ఉండడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు బయలుదేరి వస్తుండగా శనివారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది. డ్యూటీలో వెళుతుండగానే ఘటన జరగడం గమనార్హం. వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ను చౌటుప్పల్ పోలీసులు భద్రపరిచారు. ఈ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు డీఎస్పీల కుటుంబాలు హైదరాబాదులోనే నివాసం ఉంటున్నాయి. ఇద్దరు డీఎస్పీల మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రిలో మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షా కాలంలో రాత్రి పూట ప్రయాణాలు రిస్క్తో కూడుకున్న పనేనని, అత్యవసరమైతే తప్ప వానా కాలంలో ప్రయాణాలు పెట్టుకోవద్దని పోలీసులు సూచించారు.