రాత్రికి రాత్రి పొలంలోని బోరును పూడ్చి సీఎం ఫామ్ హౌజ్ కు రోడ్డు

రాత్రికి రాత్రి పొలంలోని బోరును పూడ్చి సీఎం ఫామ్ హౌజ్ కు రోడ్డు

సీఎం ఫామ్ హౌజ్ కి రోడ్డు… నాలుగు ఎకరాల వ్యవసాయ భూమున్న రైతును అన్యాయం చేసింది. యాదాద్రిలో సాగునీళ్లు లేక అప్పులు చేసి 11 బోర్లు వేసిన అన్నదాతకు… ఒకే ఒక బోరులో నీళ్లు పడటంతో రెండెకరాల్లో భూమిని సాగుచేస్తున్నాడు. అయితే సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్ వెళ్లే రోడ్డు కోసం ఇప్పుడా బోరును కూడా పూడ్చి వేశారు అధికారులు. రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బోరును పూడ్చడంతో రైతు కుటుంబం రోడ్డున పడింది.

యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్ నుంచి వాసాలమర్రి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు, పంట పొలాలను లాక్కుంటుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాసాలమర్రికి చెందిన లక్ష్మయ్య అనే రైతు, వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నాడు. సీఎం ఫాంహౌస్ కి వెళ్లడానికి కొండాపూర్ నుంచి వాసాలమర్రికి వేస్తున్న రోడ్డుకు అడ్డుగా ఉందని లక్ష్మయ్య బోరు బావిని రాత్రికి రాత్రే పూడ్చేశారు అధికారులు. దీంతో పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్న లక్ష్మయ్య కుటుంబం రోడ్డున పడింది. బోరుతో పాటు మూడెకరాల భూమిని కూడా రోడ్డు విస్తరణ కోసం అధికారులు లాక్కున్నారని ఆవేదన చెందుతున్నాడు లక్ష్మయ్య.

నిన్న సాయంత్రం వరకు ఉన్న బోరు… తెల్లారే సరికి మాయం అవడంతో రైతు లబోదిబోమంటున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి… పూడ్చిన బోరును తవ్వి…కేసింగ్ వేసి మోటర్ బిగించుకున్నామని చెబుతున్నాడు లక్ష్మయ్య. నోటీసులివ్వకుండా రాత్రికి రాత్రే బోరును పూడ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై స్పందించిన అధికారులు… బోరు బావి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తామంటున్నారు. ఒకవేళ బోరు తొలగించాల్సి వస్తే…శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇస్తున్నారు.