బంపర్ వ్యూ.. సేఫ్టీ మిర్రర్స్​ అమర్చినా.. యాక్సిడెంట్లు ఆగట్లే!

బంపర్ వ్యూ.. సేఫ్టీ మిర్రర్స్​ అమర్చినా.. యాక్సిడెంట్లు ఆగట్లే!
  • సిటీ రోడ్లపై ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
  • ప్రాణాలు కోల్పోతున్న వాహనదారులు 
  • నియంత్రణకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండట్లే
  • ర్యాష్ డ్రైవింగ్​తోనే ప్రమాదాలంటున్న జనం

సికింద్రాబాద్, వెలుగు: సిటీలో రోడ్డు ప్రమాదాలకు ఆర్టీసీ బస్సులు ఓ కారణమవుతున్నాయి. ప్రమాదాల నివారణకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు రావడం లేదు. వాహనాలను ఢీకొనడం, పాదచారులపైకి దూసుకుపోవడం వంటి  ప్రమాదాలకు ఆర్టీసీ బస్సులే కారణమవుతున్నాయని సర్వేలు కూడా పేర్కొంటున్నాయి. 2022లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులతో 265  యాక్సిడెంట్లు అయినట్టు ఆర్టీసీ సంస్థ లెక్కలు చెబుతున్నాయి. 

ఇందుకు కారణాలు ఏంటని తెలుసుకోగా.. బస్సులకు సైడ్​ మిర్రర్స్ ​ఉన్నప్పటికీ బంపర్​ముందుభాగం కనిపించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు సంస్థ అధికారులు గుర్తించారు. దీంతో యాక్సిడెంట్ల నివారణకు బస్సులకు ముందుభాగంలో బంపర్ ​వ్యూ సేఫ్టీ మిర్రర్స్​ను అమర్చారు. తద్వారా చాలావరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు చెప్పారు. సిటీలో సుమారు వెయ్యి బస్సులకు బంపర్ ​వ్యూసేఫ్టీ మిర్రర్ ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయినా.. ప్రమాదాల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. మరోవైపు సేఫ్టీ మిర్రర్స్​అమర్చిన బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు.  

 ఆరు మీటర్ల వరకు బ్లైండ్ ​స్పాట్ 

ఆర్టీసీ బస్సుల ముందుభాగంలో బంపర్​ నుంచి 6 మీటర్ల వరకు బ్లైండ్​స్పాట్​గా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.  ఆ ఏరియా పరిధిలో  డ్రైవర్​కు ఏదీ కనిపించదు. దీంతో  ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇదే ఆర్టీసీ బస్సులు ఎక్కువ యాక్సిడెంట్లకు కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా సిటీలో నిత్యం  ట్రాఫిక్ ​రద్దీ అధికంగా ఉంటుంది. బస్సులు రోడ్డుపై వెళ్తుంటే సడెన్​గా వచ్చే వాహనాలు, అకస్మాత్తుగా రోడ్డు దాటే పాదచారులు ఎదురుగా వస్తే బస్సు డ్రైవర్​కు కనిపించకపోవడంతోనే ఇతర వాహనాలను ఢీకొనడం, పాదచారులు మీదకు వెళ్లడం.. వాటి కిందపడి మృతి చెందడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు ఆర్టీసీ అధికారులు ఆరు నెలలుగా బస్సులకు సేఫ్టీ మిర్రర్స్​ను ఏర్పాటు చేస్తున్నారు. అయినా.. ఈ బస్సులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

 నివారించేందుకు చర్యలు చేపట్టినా..

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు సిటీ బస్సులకు ప్రస్తుతం ఉన్న సైడ్​ మిర్రర్స్​తో పాటు ముందు భాగంలోనూ బంపర్​వ్యూ సేఫ్టీ మిర్రర్​ను అమర్చుతున్నా.. ప్రమాదాలు ఆగడం లేదు. మిర్రర్స్​ఉన్న బస్సుల ముందు టైర్ల కిందపడి చాలామంది చనిపోతున్నారు. మిర్రర్స్ ​అమర్చిన బస్సులు కూడా వాహనాలను, వాహనదారులను, రోడ్డుపై వెళ్లేవారిని ఢీకొడుతున్నాయి. మిర్రర్స్​ ఏర్పాటు చేసినా ప్రమాదాలు తగ్గనపుడు లాభమేమిటని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. 

ఓవర్ స్పీడ్ తోనే..

సిటీ రోడ్లపై ఓవర్ స్పీడ్​తో వెళ్లరాదనే రూల్స్ ఉన్నాయి. ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం అవేవి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి. బస్సులను వేగంగా నడుపుతూ వాహనాలపైకి దూసుకొస్తున్నారని , ర్యాష్​ ​డ్రైవింగ్​ కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. 

బోరబండ వినాయకనగర్​కు చెందిన ప్రైవేటు ఎంప్లాయ్ రమ్య (40) బుద్వేల్​లోని తన అన్న ఇంటికి వెళ్లి, మంగళవారం మెహిదీపట్నం నుంచి బస్సులో వచ్చి పంజాగుట్ట క్రాస్​రోడ్​లో  దిగింది. అక్కడి నుంచి తను జాబ్ చేసే ఎర్రమంజిల్ ఏరియాకు వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా, రమ్యను జగద్గిరిగుట్ట నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కిందపడిన ఆమెపై నుంచి బస్సు టైర్లు వెళ్లడంతో స్పాట్​లోనే చనిపోయింది.