హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి : ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

హెల్మెట్, సీట్ బెల్ట్  పెట్టుకోవాలి : ఎమ్మెల్యే మల్రెడ్డి  రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, వెలుగు: బైకర్లు హెల్మెట్, కారులో వెళ్లేవారు సీట్​బెల్ట్​పెట్టుకోవాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి  రంగారెడ్డి సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా యాచారంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్​ అలైవ్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్​నిబంధనలు పాటించాలన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, క్షేమంగా ఇండ్లకు చేరాలని చెప్పారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, సీఐలు నందీశ్వర్​ రెడ్డి, సత్యనారాయణ, మధు, మహేందర్​రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్​ నాయకులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్​ రెడ్డి పాల్గొన్నారు .

స్టార్ట్​ ఎర్లీ, గో స్లోలీ, రీచ్​ సేఫ్లీ పాటించాలి

కూకట్ పల్లి, వెలుగు: స్టార్ట్​ఎర్లీ, గో స్లోలీ, రీచ్​సేఫ్లీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సైబరాబాద్ సీపీ రమేశ్​రెడ్డి సూచించారు. వేగం కన్నా ప్రాణం ముఖ్యమనే విషయాన్ని యువత గుర్తించాలన్నారు. బసంతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కూకట్​పల్లిలోని రంగధాముని చెరువు వద్ద ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్​కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వంద మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. డీసీపీ రితిరాజ్, ఏసీపీ నరేశ్​రెడ్డి, సంస్థ నిర్వాహకులు అజయ్​రాయుడు, వడ్డేపల్లి కార్తీక్​రావు పాల్గొన్నారు.