వానలు మొదలైనా..హైదరాబాద్ లో ఆగని రోడ్ల తవ్వకాలు... వాహనదారులకు చుక్కలు..

వానలు మొదలైనా..హైదరాబాద్ లో ఆగని రోడ్ల తవ్వకాలు... వాహనదారులకు చుక్కలు..

వెలుగు హైదరాబాద్ సిటీ: వర్షాకాలం మొదలైనప్పటికీ గ్రేటర్ సిటీలోని రోడ్ల తవ్వకాలు ఆగడం లేదు. వాటర్ పైప్​లైన్లు, డ్రైనేజీలు, కేబుల్స్, ఎలక్ట్రిసిటీ పనులంటూ ఇష్టారీతిన తవ్వుతూనే ఉన్నారు. మెయిన్​రోడ్ల నుంచి మొదలు పెడితే కాలనీల్లోని అంతర్గత రోడ్ల వరకు ఇదే పరిస్థితి. 

వానలు మొదలయ్యాక రోడ్ల తవ్వకాలకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. పనులు అయిపోయాక తిరిగి రోడ్డు వేయాల్సి ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టర్లు వేయడం లేదు. 

తవ్విన మట్టితో పూడ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. వానలకు నాని తవ్వినచోట గుంతలు ఏర్పడుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు తవ్వే ముందు బల్దియా నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాలి. చాలాచోట్ల ఎన్ఓసీలు తీసుకోకుండానే రాత్రికి రాత్రి రోడ్లను తవ్వి, వారి పనులు ముగించుకుంటున్నారు. పనులు అయిపోయాక కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపే అధికారం ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లకు ఉన్నా.. పట్టించుకోవడం లేదు.