- వేగంగా రిజిస్ట్రేషన్ల మంజూరు
- పన్ను వివాదాల తగ్గింపునకు చర్యలు
న్యూఢిల్లీ: జీఎస్టీ విధానాన్ని సరళతరం చేయడానికి, వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన పలు కీలక సంస్కరణలు వచ్చే నెల నుంచి దశలవారీగా అమలులోకి రానున్నాయి. ఈ మార్పుల ద్వారా చిన్న ఈ–కామర్స్ వ్యాపారులకు, సాధారణ పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఎత్తున ఊరట లభించనుంది.
చట్ట సవరణలు అవసరమైన మార్పులు మాత్రం 2027 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తాయి. ఈ సంస్కరణలకు సంబంధించిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది . చిన్న ఈ–కామర్స్ సెల్లర్లకు జీఎస్టీ నమోదు ప్రక్రియ ఎంతో సులభం కానుంది.
వేర్వేరు రాష్ట్రాల్లో సొంత ఆఫీసులు లేని చిన్న వ్యాపారులు, తాము వస్తువులను నిల్వ చేసే ఈ–కామర్స్ సంస్థల గోదాములనే తమ ప్రధాన వ్యాపార స్థలంగా ప్రకటించుకోవచ్చు. నెలకు రూ.2.5 లక్షల వరకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ బదిలీ చేసే వ్యాపారులకు ఈ వెసులుబాటు లభిస్తుంది. వీరు తమ సొంత రాష్ట్రంలో ఫిజికల్, ఆధార్ వెరిఫికేషన్‌ను పూర్తి చేస్తే చాలు.
ఇతర రాష్ట్రాల్లో నమోదు కోసం సంబంధిత ఈ–కామర్స్ సంస్థ అంగీకారం ఉండాలి. అధికారుల అనుమతులు అవసరం లేదు. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 9.5 లక్షల మంది చిన్న వ్యాపారులు ప్రతి రాష్ట్రంలో ఆఫీసు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా జాతీయ మార్కెట్‌ను చేరుకోగలరు.
దరఖాస్తు చేయడం ఈజీ
జీఎస్టీ నమోదు దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేసేందుకు చర్యలు మొదలవుతున్నాయి. దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తయ్యేందుకు అవసరమైన పత్రాల వివరాలతో కూడిన సమగ్ర సర్క్యులర్ విడుదల కానుంది. జీఎస్టీ ఆర్‌ఈజీ 01 దరఖాస్తు ఫారమ్‌లో పత్రాలను ఎంచుకునేందుకు వీలుగా ప్రత్యేక డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
జీఎస్టీ పోర్టల్‌లో స్పష్టమైన మార్గదర్శకాలు, డ్రాప్ డౌన్ జాబితాలు, టూల్ టిప్స్ అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల సరైన సమాచారం కొరత కారణంతో దరఖాస్తులు తిరస్కరణకు గురికావడం లేదా ప్రశ్నలు తలెత్తడం తగ్గుతున్నాయి. రిజిస్ట్రేషన్ అనుమతులు వేగంగా లభిస్తాయి.
ఆటోమేటిక్గా రీఫండ్లు
రీఫండ్లను సులువుగా పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్‌లో ఉన్న అదనపు నిధుల రీఫండ్ క్లెయిమ్స్ అధికారుల ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా మంజూరు అవుతాయి. లోపాల మెమో లేదా రసీదు జారీ చేసే గడువును 15 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించారు.
జీరో రేటెడ్ సప్లైలు, ఇన్వర్టెడ్ డ్యూటీ నిమిత్తం చేసే రీఫండ్ క్లెయిమ్‌లలో ప్రమాద అంచనా ఆధారంగా 90 శాతం మొత్తాన్ని సిస్టమే ప్రాథమికంగా ఆటోమేటిక్‌గా మంజూరు చేస్తుంది. పన్ను వివాదాలను తగ్గించేందుకు షోకాజ్ నోటీసుల జారీకి కనీస పరిమితిని రూ.10 వేలుగా నిర్ణయించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
