విద్యుత్ సౌధలో ప్రీ బిడ్ సమావేశం

విద్యుత్ సౌధలో ప్రీ బిడ్ సమావేశం
  •     7,800 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కొనుగోలుకు టెండర్లు
  •     ఆన్లైన్లో 120, ప్రత్యక్షంగా 70 మంది బిడ్డర్లు హాజరు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ–2025 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, ఇంధన నిల్వ సామర్థ్యాలను పెంపొందించే దిశగా రాష్ట్ర రెడ్​కో, జెన్​కో సంస్థలు మొత్తం 7,800 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు టెండర్లను జారీ చేశాయి. హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో టెండర్లకు సంబంధించి గురువారం ప్రీ- బిడ్ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆన్లైన్ ద్వారా సుమారు 120 మంది, ప్రత్యక్షంగా 70 మంది చొప్పున మొత్తం 190 మంది వరకు బిడ్డర్లు పాల్గొన్నారు. 

టెండర్ నిబంధనలు, ఇతర సాంకేతిక అంశాలకు సంబంధించి పలువురు బిడ్డర్లు సందేహాలు వ్యక్తం చేశారు. వారు లేవనెత్తిన అంశాలపై అధికారులు చర్చించి, సాధ్యమైనంత మేరకు వివరణలు ఇచ్చారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తూ, బిడ్డర్ల సందేహాలు, అభ్యంతరాలను పరిశీలించి తగిన సమాధానాలు అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జెన్ కో సీఎండీ డాక్టర్ ఎస్. హరీశ్ మాట్లాడుతూ బిడ్డర్లు తమ సందేహాలు, సూచనలను తమకు మెయిల్ చేయాలని.. వాటిని పరిశీలించి తగిన వివరణ అందిస్తామని భరోసా ఇచ్చారు. రెడ్​కో వైస్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ.. టెండర్ల ప్రక్రియలోని నియమావళిని అందరూ పాటించాలన్నారు. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెండర్లలో అనుసరించిన విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

టెండర్ల వివరాలు ఇవి..

రెడ్​కో ద్వారా 2,000 మెగావాట్ల (ఫర్మ్​ అండ్​ డిస్పాచ్​బుల్​ రెన్యూవబుల్​ఎనర్జీ (ఎఫ్​డీఆర్ఈ) కొనుగోలుకు టెండర్లు జారీ చేశారు. కనీస బిడ్ సామర్థ్యం 50 మెగా వాట్లు కాగా, గరిష్టంగా 1,000 మెగావాట్ల వరకు బిడ్ దాఖలు చేయవచ్చు. 3,000 మెగావాట్ల సౌర విద్యుత్తో పాటు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో 6,000 మెగావాట్ గంటల నిల్వ సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్​ఎస్​) ఏర్పాటు కోసం టెండర్లు జారీ చేశారు.  

కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లుగా నిర్ణయించారు. 800 మెగావాట్ల పవన విద్యుత్ కొనుగోలుకు టెండర్లు పిలిచారు.  కనీస బిడ్ సామర్థ్యం 50 మెగావాట్లు కాగా, గరిష్ట పరిమితి 400 మెగావాట్లుగా ఉంది. జెన్​కో ద్వారా ఎఫ్​డీఆర్ఈ విధానంలో భాగంగా 500 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు గంటల పాటు విద్యుత్ను నిల్వ చేసి సరఫరా చేయగల నాలుగు యూనిట్లకు సమానమైన మొత్తం 2,000 మెగావాట్ల బ్యాటరీ నిల్వ వ్యవస్థ (బీఈఎస్​ఎస్) ఏర్పాటు కోసం టెండర్లు జారీ చేశారు.