రోడ్డు పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలి : మంత్రి హరీశ్​ రావు

రోడ్డు పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలి : మంత్రి హరీశ్​ రావు

సిద్దిపేట, వెలుగుః సిద్దిపేట, మెదక్ నేషనల్ హై వేకు  సంబంధించి భూ సేకరణ తొందరగా పూర్తి చేయాలని, రోడ్డు పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని మంత్రి హరీశ్​ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో  హైవే 1,2 రీచ్​ల పనులపై ఆయన ఆర్ అండ్ బీ ఆఫీసర్లతో రివ్యూ చేశారు.  సిద్దిపేట జిల్లా  పోతారెడ్డిపేట్ నుంచి  రంగధామ్ పల్లి  వరకు రీచ్​ 1 , మెదక్ టౌన్ నుంచి  నిజాం పేట వరకు రీజ్​2 పనులు చేపట్టనున్నట్టు  మంత్రి తెలిపారు. మెదక్ నుంచి  సిద్దిపేట వరకు  మొత్తం 69.97 కిలోమీటర్ల ఫోర్​లేన్​ హైవే నిర్మాణానికి 882.18 కోట్లు ఖర్చవుతందని అంచనా వేసినట్టు చెప్పారు.  సిద్దిపేట జిల్లా  పోతిరెడ్డిపేట్, అక్బర్ పేట్, చిట్టాపూర్, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్, ఇర్కోడు, బూరుగుపల్లి,  సిద్దిపేట టౌన్,   మెదక్ జిల్లాలో  మెదక్ టౌన్ , పాతూరు, అక్కన్నపేట్, రామాయంపేట్, కోనాపూర్, నందిగామ, నిజాంపేట్ ల మీదుగా రోడ్డు వెళ్తుందన్నారు. ఈ గ్రామాల పరిధిలో ఫోర్  లైన్ రోడ్ వెంట  స్ట్రీట్ లైట్స్, ఇరువైపులా  రేయిలింగ్,  సైడ్ డ్రైన్లు, ఫుట్ పాత్ లు నిర్మించాలన్నారు.   సిద్దిపేట టౌన్ లో  ఎన్ సాన్ పల్లి జంక్షన్ నుంచి రంగధాంపల్లి బ్రిడ్జి వరకు రెండు  వై పులా  సర్వీస్ రోడ్డు వేయాలన్నారు.  ఎన్ సాన్ పల్లి సర్కిల్ వద్ద వెహికల్  అండర్ పాస్,  హైదరాబాద్,  రామగుండం రోడ్ వద్ద ఓవర్ పాస్ నిర్మించనున్నట్లు  ఆర్ అండ్ బీ అధికారులు మంత్రికి తెలిపారు.  రామాయం పేటలో  ఎన్ హెచ్ 44 ను క్రాస్  చేసేందుకు అండర్ పాస్, గజ్వేల్ రోడ్ లో రామాయం పేట దగ్గర  మరో  అండర్ పాస్ నిర్మిస్తున్నట్లు,  అక్కన్నపేట్  రైల్వే ట్రాక్ దగ్గర అండర్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు  వివరించారు.

ఈ హైవే వల్ల  సిద్దిపేటలో 4 మేజర్,  19 మైనర్ జంక్షన్లు,   మెదక్ జిల్లాలో 4 మేజర్,  15 మైనర్ జంక్షన్ల అభివృద్ధి జరుగుతుందన్నారు.  హై వే  పనుల కోసం మెదక్ జిల్లాలో 26.82 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 18.25 హెక్టార్ల భూసేకరణ చేపట్టాల్సిఉందని,  మెదక్ జిల్లాలో 9 .35 హెక్టార్ల  మేరకు  అటవీ భూమి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్పారు.  భూ సేకరణ వేగంగా చేయాలని మెదక్, సిద్దిపేట  కలెక్టర్లకు మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా ఆదేశించారు. అటవీ అధికారులతో కూడా మాట్లాడారు. బ్రిడ్జిల దగ్గర  వర్షం  నీళ్లు నిలవకుండా   డ్రైనేజీ ఏర్పాటు చేయాలని  మంత్రి   ఆదేశించారు.  ఈ సమావేశంలో  ఆర్ అండ్​ బీ  నేషనల్​హైవేస్ విభాగం ఈఈ ధర్మారెడ్డి, ఎస్. ఈ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అడ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.