- మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టు: మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విశ్వాసానికి ప్రతిబింబమని అభిప్రాయపడ్డారు.
మూడో విడత ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని, గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు ఈ ఫలితాలు నిదర్శనమని, ఈ విజయం వెనుక సమన్వయంతో కూడిన బలమైన ప్రచార వ్యూహాలే ప్రధాన కారణమని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెండేండ్లుగా అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ, అభివృద్ధి పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్న తీరు.. ఈ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిపించిందన్నారు.
సీఎం, మంత్రులు స్వయంగా పర్యటిస్తూ తీసు కుంటున్న నిర్ణయాలు గ్రామీణ ఓటర్లలో కాంగ్రెస్ పై విశ్వాసాన్ని పెంచాయనన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని మహేశ్ గౌడ్ అన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, రైతులు, యువత పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక న్యాయం స్పష్టంగా ప్రతిఫలించిందని వ్యాఖ్యానించారు.
ఈ విజయం పార్టీపై మరింత బాధ్యతను పెం చిందని, గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వం ముందుకు సాగుతుందని.. సర్పంచ్ ఎన్నికల తొలి, రెండో, మూడో విడతల ఫలితాలు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై గ్రామీణ స్థాయిలో ఏర్పడిన అనుకూల వాతావరణానికి అద్దం పడుతున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
