- ఈ ఏడాదే డిజైన్ మార్చిన విద్యాశాఖ ఆఫీసర్లు
- జనవరి నెలాఖరుకల్లా మండలాలకు క్లాత్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్ పిల్లల యూనిఫామ్ విషయంలో ఎడ్యుకేషన్ ఆఫీసర్లు యూటర్న్ తీసుకున్నారు. ఈ ఏడాదే మార్చిన డిజైన్‌ను పక్కనపెట్టి.. మళ్లీ పాత మోడల్‌నే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు. యూనిఫామ్ డిజైన్ మార్పునకు అనుమతి కోరుతూ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ఇటీవలే ప్రతిపాదనలు పంపించారు.
దీనికితోడు వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి యూనిఫామ్ పంపిణీలో ఆలస్యం జరగకుండా ఇప్పటి నుంచే అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా సర్కారు విద్యాసంస్థల్లో చదివే సుమారు 20 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా రెండు జతల యూనిఫామ్ అందిస్తున్నది.
దీనికి సంబంధించి సుమారు కోటి మీటర్లకు పైగా క్లాత్‌ను టెస్కో ద్వారా సేకరిస్తున్నది. దీన్ని అమ్మ ఆదర్మ పాఠశాలల కమిటీలు, మహిళా సంఘాల ద్వారా కుట్టిస్తున్నది. అయితే, 2023లో కొత్త డిజైన్ తో కూడిన యూనిఫామ్ లను ఇచ్చారు. ఎరుపు, బూడిద రంగు చొక్కా, మెరూన్ రంగు సూటింగ్ లో ఉన్నాయి. అప్పటి డిజైన్ లో షర్టులకు పట్టీలు, భుజంపై ఉచ్చులు పెట్టారు. దీన్ని ఈ విద్యాసంవత్సరం మార్చారు.
కలర్లో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం పట్టీలను తొలగిస్తూ కొత్త మోడల్ తీసుకొచ్చారు. ఇది పెద్దగా లుక్ లేకపోవడంతో, మళ్లీ పట్టీలు, ఉచ్చులు ఉండే పాత మోడల్ లోనే యూనిఫామ్స్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. అయితే, క్లాత్ కు సంబంధించిన ప్రతిపాదనలను టెస్కోకు అందించారు. జనవరి నెలాఖరులోగా అన్ని మండల కేంద్రాలకు పంపించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ ఏడాదిలాగే స్కూళ్ల రీఓపెన్ నాటికి స్టూడెంట్లకు యూనిఫామ్ అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
