- హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు
- 19న రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో ప్రసంగం
- 20న శాంతి సరోవర్ సదస్సు, 21న ‘ఎట్ హోమ్’.. 22న తిరుగు ప్రయాణం
హైదరాబాద్, వెలుగు: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న ఆమెకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, సీఎస్, డీజీపీ స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము బస చేయనున్నారు. డిసెంబర్ 19న రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఫిలిం సిటీ వేదికగా జరుగనున్న ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో జరిగే సదస్సుకు ముర్ము హాజరవుతారు. 21న రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, ప్రజలతో భేటీ అయి ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 22న సాయంత్రం తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు. హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో డ్రోన్లు ఎగురవేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. అల్వాల్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో 17 నుంచి 22 వరకు డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్టుల ఎగురవేతపై నిషేధం విధించారు.
20, 21 తేదీల్లో పర్యటించనున్న ఉప రాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి సీపీ రాధా కృష్ణన్ హైదరాబాద్ లో ఈ నెల 20 ,21 తేదీల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 20న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తారు. పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం లోక్ భవన్ లో రాత్రి బస చేస్తారు. 21న ఉదయం కన్హా శాంతి వనంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ధ్యాన దినోత్సవంలో పాల్గొని ఢిల్లీ తిరిగి వెళ్తారు.
