
- ఎక్కడికక్కడ గుంతలు, కంకర తేలడంతో రాకపోకలకు ఇబ్బందులు
- జీహెచ్ఎంసీ పరిధిలో చాలా రోడ్లు గుంతలమయం
- ట్రాఫిక్‌తో ఇబ్బందిపడుతున్న ప్రజలు
- ఒక్క ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోనే 1,130 కిలోమీటర్ల మేర రోడ్లు డ్యామేజీ
హైదరాబాద్, వెలుగు: మొన్నటి వరకూ కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాష్ట్రంలోని చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ సిటీతో మొదలుకొని పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. రోడ్లపై ఎక్కడికక్కడ గుంతలు పడడం, కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్నిచోట్ల అయితే కనీసం టూవీలర్లు, ఆటోలు సైతం నడపలేని పరిస్థితి కనిపిస్తున్నది.
మారుమూల గ్రామాలకు కనీసం అంబులెన్స్‌లు కూడా వెళ్లలేకపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి సుమారు 2 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు దెబ్బతిన్నట్లు ఇప్పటికే ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ రోడ్ల రిపేర్ల కోసం రూ.1,936 కోట్లు అవసరం అవుతాయని సర్కార్‌కు ప్రపోజల్స్ పంపించారు.
దెబ్బతిన్న 1,130 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లు
భారీ వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, మెదక్, వరంగల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీస్థాయిలో నష్టపోయాయి. వరదల కారణంగా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని 1,130 కిలోమీటర్ల మేర రోడ్లు, 58 బ్రిడ్జిలు, 488 కల్వర్టులు దెబ్బతిన్నాయి. 421 చోట్ల రోడ్లు తెగిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డి జిల్లాలో 64.74 కిలోమీటర్ల రోడ్లు పాడవగా.. 19 బ్రిడ్జిలు, 47 కల్వర్టులు, మెదక్ జిల్లాలో 148 కిలోమీటర్ల రోడ్లు, 11 బ్రిడ్జిలు, 41 కల్వర్టులు కొట్టుకుపోయాయి. అలాగే, ఖమ్మం జిల్లాలో 142, సంగారెడ్డిలో 72, నిజామాబాద్‌లో 58 కిలోమీటర్ల మేర రోడ్లు పాడైనట్లు ఇంజినీరింగ్ ఆఫీసర్లు చెప్పారు. దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులకు రూ. 69 కోట్లతో తాత్కాలిక మరమ్మతులు చేశారు. శాశ్వత రిపేర్ల కోసం కోసం రూ.1,136 కోట్లు అవసరమని ఆఫీసర్లు అంచనా వేశారు.
దెబ్బతిన్న 1,291 కిలోమీటర్ల పీఆర్ రోడ్లు
భారీ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1,291 కిలో మీటర్ల పంచాయతీ రాజ్ రోడ్లు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. ఈ రోడ్లను రిపేర్లు చేసేందుకు రూ.800 కోట్లు అవసరం అవుతాయని ప్రపోజల్స్ రెడీ చేశారు. ఆగస్టులో కురిసిన వానలకు కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో వందల సంఖ్యలో రోడ్లు దెబ్బతినగా.. రూ.374 కోట్ల నష్టం జరిగింది. అలాగే, 60 కల్వర్టులు డ్యామేజీ కాగా.. 88 చోట్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. వరదల్లో దెబ్బతిన్న రోడ్లకు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు రూ.1,936 కోట్లు అవసరమని ప్రపోజల్స్ రెడీ చేశారు.
పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామశివారులో భారీ వర్షాలకు సెలిమాగు బ్రిడ్జి కొట్టుకుపోయింది. వంద మీటర్లకు పైగా బీటీ రోడ్డు కూడా దెబ్బతిన్నది. దీంతో ధర్మారం, సోన్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కనీసం టూ వీలర్ వెళ్లే సౌకర్యం కూడా లేకపోవడంతో పొలం పనులకు వెళ్లే రైతులు, కూలీలు నీళ్లలో నడుచుకుంటూ వెళ్తున్నారు.
రోడ్డు మధ్యలో భారీ గుంతలు..
ఇది ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ సమీపంలోని 163వ జాతీయ రహదారి. భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి మధ్యలో గుంతలు ఏర్పడడంతో వాహనాదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏటూరునాగారం నుంచి మంగపేట మండలం కమలాపురం వరకు ఇదే పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్‌లో రోడ్లు ధ్వంసం
గ్రేటర్ హైదరాబాద్‌లో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు గుంతలమయం అయ్యాయి. రేతిబౌలి, నానల్ నగర్ సిగ్నళ్ల వద్ద భారీగా ధ్వంసం కావడంతో ఇక్కడ ట్రాఫిక్ స్లోగా సాగుతున్నది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. చాదర్‌ఘాట్, దారుల్ షిఫా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాట్ హోల్స్ ఏర్పడ్డాయి. వనస్థలిపురంలో రోడ్లు పూర్తిగా పాడయ్యాయి.
నల్లకుంట, బాగ్ లింగంపల్లిలోని మెయిన్ రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. చందానగర్ నుంచి అమీన్పూర్వెళ్లే రోడ్డుపై అడుగుకోగుంత కనిపిస్తున్నది. ఇలా గ్రేటర్ సిటీలోని చాలా ఏరియాల్లో గుంతలు పడగా, వర్షం కురిసినప్పుడు వాటిలో పడి చాలా మంది గాయపడ్తున్నారు. గ్రేటర్హైదరాబాద్ పరిధిలో14,871 చోట్ల రోడ్లపై గుంతలు పడినట్లు ఇటీవల జీహెచ్ఎంసీ గుర్తించింది. వీటిలో 12,564 గుంతలకు రిపేర్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
50 మీటర్ల మేర తెగిన రోడ్డు
ఇది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కంకెట గ్రామం నుంచి వైకుంఠపూర్ గ్రామం మధ్యలో గల ప్రధాన బీటీ రోడ్డు. ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 50 మీటర్ల మేర రోడ్డు తెగిపోయింది. మరికొన్ని చోట్ల కంకర తేలడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. కొన్ని చోట్ల అయితే రాత్రి సమయంలో రావడానికే ప్రజలు భయపడుతున్నారు.
టూ వీలర్లు వెళ్లలేని పరిస్థితి
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో దెబ్బతిన్న బీటీ రోడ్డు. కొత్త బస్టాండ్ నుంచి అశోక్‌నగర్ కాలనీలోని ర్లైల్వే గేట్‌వరకు ఈ రోడ్డు వేయగా వరదలకు నాలుగైదు చోట్ల భారీ గుంతలు పడ్డాయి. ఈ రోడ్డుపై టూ వీలర్స్‌పైన వెళ్లాలంటేనే భయపడుతున్నారు.