కొత్తగూడెం జిల్లాలో రహదారులు అధ్వానం

కొత్తగూడెం జిల్లాలో రహదారులు అధ్వానం
  • రూ.100 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపిన అధికారులు
  • బడ్జెట్​ లేదంటున్న ప్రభుత్వం.. ప్రయాణికుల తిప్పలు 

భద్రాచలం, వెలుగు : గత జులైలో వచ్చిన భారీ వరదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అతలాకుతలం చేశాయి. ఎంతోమంది నిరాశ్రయులు కాగా, పంటలు చేతికందక రైతులు కుదేలయ్యారు. రోడ్లన్నీ ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని మండలాల్లో ఆర్​అండ్​బీ రోడ్లు దెబ్బతిని రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే వరద తగ్గి రెండు నెలలవుతున్నా రోడ్ల పునరుద్ధరణ పనులపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. రిపేర్ల కోసం రూ.100 కోట్లు కావాలని భద్రాద్రి కొత్తగూడెం ఇంజినీరింగ్​శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో రోడ్లపై గుంతలు భయపెడుతున్నాయి. అడుగుకో గుంత ఉండడం, కనీసం రిపేర్లు కూడా చేయకపోవడంతో రోడ్లపై ప్రయాణం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

రిపేర్లు కూడా చేయట్లే...!
భద్రాచలం–-చండ్రుపట్ల రూట్​లో 10 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతింది. ఈ రోడ్డు రిపేర్లకు కనీసం రూ.70 లక్షల వరకు కావాలి. బూర్గంపాడు–-ఏటూరునాగారం మధ్య 15 కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసం కాగా, రూ.70 లక్షలు పెడితేనే ప్రయాణానికి అనుకూలంగా మారుతుంది. సారపాక–-మొండికుంట మధ్య దెబ్బతిన్న రోడ్లకు రూ.9 లక్షలు వెచ్చిస్తేనే బాగవుతుంది. ఈ రోడ్ల రిపేర్ల కోసం భద్రాచలం ఆర్అండ్​బీ డివిజన్​ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఖర్చుతో పాటు మరో రూ.కోటి మరమ్మతుల కోసం కావాలని సర్కారును అడిగింది. అయినా రూపాయి కూడా ఇవ్వలేదు. కొత్తగూడెం డివిజన్​లోని బూర్గంపాడు మండలం శివారున ఉన్న కుక్కునూరు వెళ్లే రోడ్డు కూడా పూర్తిగా దెబ్బతింది. ఈ రోడ్డును కేంద్ర బృందం పరిశీలించింది. ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు తిరగలేని పరిస్థితి ఉంది. కనీసం గుంతలను పూడ్చే పనికి కూడా సర్కారు నిధులు ఇవ్వడం లేదు. అశ్వాపురం మండలంలో ఇసుకవాగు, తుమ్మలచెరువు లో లెవెల్​ వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  కనీసం రిపేర్ల కోసమైనా బడ్జెట్​ కేటాయిస్తే రాకపోకలకు వీలవుతుంది. అయితే బడ్జెట్​ లేదనే సాకుతో ప్రభుత్వం వదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రతిపాదనలు పంపినా చప్పుడు లేదు
జిల్లాలో గోదావరి వరదలకు దెబ్బతిన్న రోడ్ల విషయంలో ఆర్అండ్​బీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. 35 చోట్ల 251.50 కిలోమీటర్లు రోడ్లు ఖరాబయ్యాయని రూ.79.19కోట్లు కావాలని అడిగింది. ఆరు చోట్ల రోడ్లు పూర్తిగా నాశనమయ్యాయని, వాటి కోసం రూ.20.77కోట్లు కావాలని రిపోర్టు పంపింది. మొత్తం రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించింది. ఇవి కాకుండా ఇల్లెందు–-కొత్తగూడెం సెక్షన్​లో రూ.2కోట్లు, రుద్రంపూర్ ​-భద్రాచలం మధ్య రూ.52 లక్షలు కలిపి రూ.2.52కోట్లు రిపేర్లకు కావాలని ప్రపోజల్స్ ​పంపింది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి స్పందనే లేదు.

వాహనాలు దెబ్బతింటున్నాయి
కుక్కునూరు- భద్రాచలం రూట్​లో బూర్గంపాడు వద్ద  వరదలకు దెబ్బతిన్న రోడ్డు ప్రమాదకరంగా ఉంది. కోతకు గురి కావడంతో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఈ రోడ్డుపై నుంచి వెళ్లేప్పుడు ఆటో అందులో పడి చెడిపోతోంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొత్త రోడ్లు వేయకున్నా కనీసం రిపేర్​ అయినా చేయించాలి.  - బొండాడ అరుణ్​కుమార్​, డ్రైవర్​

ఎదురుచూస్తున్నాం
దెబ్బతిన్న రోడ్ల పనుల కోసం రూ.100కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. వాటి కోసమే ఎదురుచూస్తున్నాం. నిధులు రాగానే పనులు మొదలుపెడతాం.  - బీమ్లా,ఈఈ, ఆర్​అండ్​బీ