
- కొట్టకుపోయిన కాజ్‌వేలు
- నరకం చూస్తున్న ప్రయాణికలు
కామారెడ్డి , వెలుగు: ఇటీవల కురిసిన వర్షాలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని రోడ్లు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక బార్డర్ లో ఉండే ఈ ఏరియాలో చాలా వరకు రోడ్లు ఆధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి రిపేర్లకు నోచుకోకపోవడం, కొత్తగా వేసిన రోడ్లు కూడా పలు చోట్ల గుంతలు పడడంతో ఈ రూట్లలో వెళ్లే ప్రజలు నరకం చూస్తున్నారు. మెయిన్ రోడ్లతో పాటు ఊర్లకు వెళ్లే దారుల్లో కాజ్‌వేలు కూడా కొట్టుకుపోవడం, గుంతలు పడడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, పెద్దకొడల్గల్మండలాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. పెద్ద వాహనాలే కాదు బైక్‌లపై కూడా ప్రయాణం చేయలేని దుస్థితి ఉంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. బిచ్కుంద మండలం ఎల్లారం, శాంతపూర్, రాజ్‌పూర్ రోడ్డు కంప్లీట్‌గా గుంతలు ఏర్పడ్డాయి. మద్నూర్ మండలం సిర్పూర్ సమీపంలో నిర్మించిన బ్రిడ్జి కూడా ఇటీవల వరదలకు కొట్టుకుపోయింది.
కొట్టుకుపోయినా రిపేర్ చేయట్లే..
వర్షాలు, వరదలకు చాలా చోట్ల రోడ్లు, కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. కాజ్ వేలపై పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్‌శాఖ ఆఫీసర్లు తాత్కలిక రిపేర్లు కూడా చేయడం లేదు. వరదలకు గుంతలు పడిన కాజ్‌వేల దగ్గర కనీసం మట్టిని పోసి పూడ్చడం లేదు. జనం ఆ గుంతల్లో నుంచే పడుతూ లేస్తూ వెహికల్స్‌పై వెళ్తున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి రోడ్లకు రిపేర్ చేయించాలని పలువురు కోరుతున్నారు.
- జుక్కల్- మద్నూర్ మధ్య రాకపోకల కోసం మూడేళ్ల కింద రోడ్డు నిర్మాణ పనులు షూరు చేశారు. ఏండ్లు గడుస్తున్నా పనులు ఇంకా కంప్లీట్ కాలేదు. మధ్యలో 3 నుంచి 4 కి.మీ మేర పనులు కంప్లీట్ కావాల్సి ఉంది. బ్రిడ్జి నిర్మాణ పనులు సగం చేసి వదిలేశారు. దీంతో రెండు మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
- ఇది బిచ్కుంద మండలం ఎల్లారం- రాజ్‌పూర్- శాంతపూర్‌తో పాటు పలు ఊర్లకు వెళ్లే బీటీ రోడ్డు. ఈ దారిలో చాలా చోట్ల గుంతలు ఏర్పడి రాకపోకలకు ప్రాబ్లమ్ అవుతోంది. ఫోర్వీలర్స్తో పాటు, ఆటోలు, బైక్‌లపై వెళ్లేటప్పుడు జనం నరకయాతన పడుతున్నారు. రోడ్డు రిపేర్ విషయంలో యంత్రాంగం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
- ఇది మద్నూర్ మండలం పెద్ద తడ్గురు - చిన్న తడ్గురు మధ్య రోడ్డు. అప్పటికే గుంతలు పడి ఉన్న కాజ్వే వద్ద ఇటీవల కురిసిన భారీ వానలతో బీటీ కొట్టుకుపోయి పెద్ద గుంతగా తయారైంది. ఈ తోవలో వెళ్లే వెహికల్స్‌కు ప్రాబ్లమ్ అవుతోంది. రాత్రి వేళ కొత్త వాళ్లు ఎవరైనా వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. కాజ్వే దెబ్బతిని రోజులు గడుస్తున్నా ఆఫీసర్లు కనీసం ఇందులో తట్టెడు మట్టి కూడా పోయడం లేదు.