సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అస్తవ్యస్తంగా రోడ్లు

సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అస్తవ్యస్తంగా రోడ్లు
  • కనీసం మట్టి కూడా పోయించని అధికారులు
  • ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు 

మెదక్/సంగారెడ్డి/శివ్వంపేట, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో  రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, మున్సిపల్ రోడ్లతో పాటు, నేషనల్ హైవేస్​ కూడా పూర్తిగా డ్యామేజీ అయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో కిలో మీటర్ల పొడువునా గుంతలు పడి, కంకర తేలి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వెహికల్స్​కే కాకుండా కొన్ని రోడ్లపై కాలినడకన కూడా వెళ్లలేకుండా మారాయి. దీంతో వాహనదారులు గమ్యం చేరేందుకు గంటలకొద్ది సమయం పడుతుండడంతో పాటు, వెహికల్స్​పాడవుతున్నాయి. ప్రమాదాలు జరుగుతున్నాయి.  రోడ్లను బాగు చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్తున్నా.. ఎక్కడా తట్టెడు మట్టిపోసిన  దాఖలాలు  కనిపిస్తలేవు.

సంగారెడ్డి జిల్లాలో.. 

జిల్లా పరిధిలో 161, 65 నేషనల్ హైవేలపై  ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. డ్యామేజ్ అయిన నేషనల్ హైవేలను కూడా రిపేర్ చేయకపోవడం వల్ల తరచుగా  ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్, పటాన్ చెరు నియోజకవర్గాల్లోని అంతర్గత రోడ్లు  పూర్తిగా దెబ్బతిన్నాయి.  మున్సిపాలిటీల విషయానికి వస్తే రోడ్లకు కనీస మరమ్మతులు చేయకపోవడంతో రోడ్లపై గుంతల్లో వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి.  సంగారెడ్డి, తెల్లాపూర్, అందోల్-జోగిపేట, నారాయణఖేడ్, సదాశివపేట మున్సిపాలిటీల్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉంది. తెల్లాపూర్ బల్లియాలో రోడ్లు, ఇతర స్థానిక సమస్యలు పరిష్కరించలేని కారణంగా  మున్సిపల్ చైర్​పర్సన్​రాజీనామా చేసి రెండునెలలవుతున్నప్పటికీ  ఇప్పటికీ ఒక్క రోడ్డును కూడా బాగు చేయలేదు. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి రోడ్ల సమస్యల గురించి తీర్మానం చేసే పరిస్థితి లేకుండా పోయింది.

మెదక్ జిల్లాలో..

  • శివ్వంపేట మండలం ఉసిరికపల్లి చౌరస్తా నుంచి ఉసిరికపల్లి, పాంబండ, భీమ్లా తండా, శంకర్ తండా,  పోతులగూడ వరకు 8 కిలోమీటర్ల రోడ్డు అధ్వాన్నంగా మారింది.
  • ఇదే మండలంలో చెండి చౌరస్తా నుంచి చెండి, గోమారం, లచ్చిరెడ్డి గూడెం, నవాపేట్, అనంతారం చౌరస్తా వరకు 10 కిలోమీటర్లు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. శివ్వంపేట చెరువుకట్టపై నుంచి రత్నాపూర్, పిల్లుట్ల, అల్లిపూర్, కొత్తపేట్, తాళ్లపల్లి గడ్డ తండా, బిక్య తండా గ్రామాలకు వెళ్లే దారి 2 కిలోమీటర్లు వరకు పూర్తిగా దెబ్బతింది. 
  • కొల్చారం నుంచి అంసాన్ పల్లి గేట్ వరకు  4 కిలోమీటర్ల దూరం రోడ్డు పూర్తిగా దెబ్బతింది. ఆసాంతం కంకర తేలి, అనేక చోట్ల గుంతలు పడి దారుణంగా మారింది. కొల్చారం బస్టాండ్ నుంచి గ్రామంలోకి  వెళ్లే రోడ్డు గుంతలు పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
  • మెదక్ మండలం మంబోజిపల్లి చౌరస్తా నుంచి కొల్చారం మండలం కొంగోడ్ గ్రామం వరకు 10 కిలో మీటర్ల దూరం రోడ్డు మీద అనేక ప్రాంతాల్లో గుంతలు పడి  వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. 
  • చేగుంట నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్​కు వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డు అనేక చోట్ల గుంతలమయమైంది.