జలమయమవుతున్న రోడ్లు

జలమయమవుతున్న రోడ్లు

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: నగరంలో వర్షం పడిందంటే చాలు ఇబ్బందులు తలెత్తతున్నాయి. సరిగ్గా లేని డ్రైనేజీ వ్యవస్థతో  తరచూ సమస్యలు వస్తున్నాయి.  కొద్దిపాటి వానకే  వరద, మురుగు నీటితో అవి పొంగిపొర్లుతున్నాయి.  దీంతో అటుగా వెళ్తున్న వారికి, స్థాకంగా నివాసం ఉంటున్న వారికి  సమస్యలు ఎదురవుతున్నాయి.  గంటసేపు వాన కురిస్తే చాలు.. నగరంలోని మయూరీ సెంటర్​, వైరారోడ్డు, గాంధీచౌక్​, ఐటీ హబ్​  దగ్గర పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలుస్తోంది.  వెహికల్స్​ పోలేని పరిస్థితి  తలెత్తుతోంది. 

పూడిక తీత మరిచారు...

నగరంలోని డ్రైనేజీల్లో పూడిక తీయాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. చిన్నపాటి వాననీటితో మురుగునీరు కలిసి రోడ్లపై వరదలా పారుతోంది.  గతంలో త్రీటౌన్​ ప్రాంతంలో ఉన్న గోళ్ళపాడు ఛానల్​ పొంగిపొర్లుతుండంతో అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొనేవారు.  అక్కడ ప్రభుత్వం సుమారు 100 కోట్లతో అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇది పూర్తయితేనే శాశ్వత పరిష్కారం దొరకనుంది.  దీంతోపాటు  గోళ్ళపాడు ఛానల్​ను ఆధునీకరించి ప్రకాశ్​​నగర్​లో ఎస్​టీపీని ఏర్పాటు చేస్తున్నారు.  ఎస్​టీపీలో ట్రీట్మెంట్​ అయిన నీటిని మున్నేరులో వదలనున్నారు.  

అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ ఏర్పాటు డీపీఆర్​ సిద్ధం.. 

రానున్న రోజుల్లో పూర్తిస్థాయి అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పబ్లిక్​ హెల్త్​ ఈఈ రంజిత్​ తెలిపారు.  ఇప్పటికే ఖమ్మం నగరమంతా అండర్​గ్రౌండ్​ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు డీపీఆర్​ తయారుచేసి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు అందించినట్టు ఆయన  తెలిపారు.  దీని కోసం సుమారు 500కోట్లు మేర ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేసినట్లు ఆయన తెలిపారు.