హైదరాబాద్ మెయిన్​ చౌరస్తాల్లో అభివృద్ధి స్లో 

హైదరాబాద్ మెయిన్​ చౌరస్తాల్లో అభివృద్ధి స్లో 
  • 90 జంక్షన్లకు.. సగమైనా కాలె!
  • సిటీలో మెయిన్​చౌరస్తాల్లో అభివృద్ధి స్లో 
  • రోడ్ల విస్తరణ లేక ట్రాఫిక్​ జామ్​లు​
  • ఏండ్లుగా కాలం గడిపేస్తున్న బల్దియా 

హైదరాబాద్, వెలుగు: సిటీలో ట్రాఫిక్​ ప్రాబ్లమ్స్​ను తగ్గించేందుకు  మెయిన్​జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పే జీహెచ్ఎంసీ ఆ విషయాన్నైతే పట్టించుకుంటలేదు.  మెట్రో రైల్ పనులు పూర్తయిన తర్వాత ​జంక్షన్లు కూడా కనిపిస్తలేదు. మెట్రోకు ముందు పెద్ద జంక్షన్లతో పాటు చాలా చోట్ల  సిగ్నల్​ఫ్రీ కింద యూటర్న్​లు ఉండేవి. మెట్రో అందుబాటులోకి వచ్చాక జంక్షన్లను వదిలేసింది. ఏండ్లుగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని బల్దియా  చెబుతుంటే స్లోగా నడుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అయ్యే ఏరియాలపైనా రోడ్డు విస్తరణపై దృష్టిపెట్టడంలేదు. బైక్​తో రోడ్డెక్కితే చాలు ఎక్కడ ట్రాఫిక్​ జామ్​అవుతుందో  తెలియక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. పంజాగుట్ట, లిబర్టీ, రేతిబౌలి, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్​రోడ్​నం. 12, రోడ్ నం.10, తాజ్ కృష్ణ,  ప్యారడైస్, ప్యాట్నీ, రాణిగంజ్,  కోఠి, ఇందిరాపార్కు, పురానాపూల్, చాదర్ ఘాట్, మలక్ పేట్, వనస్థలిపురం, మియాపూర్, ఆల్విన్​కాలనీ, చందానగర్, లింగంపల్లి, ట్రిపుల్​ఐటీ, ట్యాంక్ బండ్ లాంటి జంక్షన్ల వద్ద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎప్పటి నుంచో ఈ జంక్షన్లు ఇలా ఉండగా, మెట్రో రైల్ ఉన్న ప్రాంతాల్లో రైల్​ అందుబాటులోకి వచ్చిన తర్వాత తరచూ ట్రాఫిక్​ జామ్​లు అవుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ జామ్​ఎక్కువగా అయ్యే ఏరియాల్లో కూడా రోడ్ల విస్తరణపై బల్దియా ఫోకస్​చేయడం లేదు. 

ఇప్పట్లో కష్టమే..
రోడ్ల విస్తరణ చేపట్టిన కొద్దీ అదే తరహాలో ట్రాఫిక్​పెరుగుతుంది. ఒకప్పుడు సిగ్నల్ కూడా అవసరం లేని ప్రాంతాల్లో ఇప్పుడు కిలోమీటరు వరకు ట్రాఫిక్ జామ్​అవుతుంది. పోలీస్ శాఖ సూచనల మేరకు సిటీలో 90 జంక్షన్ లను అభివృద్ధి చేసేందుకు రెండేళ్ల కిందట బల్దియా నిర్ణయం తీసుకుంది. జంక్షన్ల విస్తరణ పనులను ఆయా జోనల్ కమిషనర్లకు అప్పగించింది. 69 జంక్షన్ల వద్ద పనులు పూర్తయినట్లు, మరో 21 జంక్షన్లలో  త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారు.  గ్రౌండ్ లెవల్​లో చూస్తే వేరేలా ఉంది. ఎప్పుడో పూర్తయిన హైటెక్ సిటీ,  వంద ఫీట్ల రోడ్డు, ఎల్​బీనగర్, ఖైరతాబాద్​, నెక్లెస్​రోడ్, ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్​లోని పలు జంక్షన్ల పనులు తాజాగా పూర్తి చేసినట్లు బల్దియా తన అకౌంట్​లో వేసుకుంటుంది. కొత్త వాటిపైన దృష్టిపెట్టడంలేదు.  ఎల్​బీనగర్ జోన్ లో  11, చార్మినార్ జోన్ లో 9,  ఖైరతాబాద్ జోన్ లో 34, శేరిలింగం పల్లిలో 11, కూకట్ పల్లిలో 10, సికింద్రాబాద్ జోన్ లో మొత్తం 15 జంక్షన్ లను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా ఇందులో సగం కూడా పూర్తికాలేదు. 

సిగ్నల్స్ ​కూడా పడట్లే..
సిటీలో మొత్తం 221 సిగ్నల్స్ ఉండగా ఏటీఎస్​ సిస్టమ్ ద్వారా కొత్తగా 155 సిగ్నల్స్,  మరో 98 సిగ్నల్స్ ను పెలికాన్ (పెడస్ట్రియన్​) సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసినట్లు బల్దియా చెబుతుంది. ఈనెలాఖరులో పనులు కంప్లీట్​అవుతాయని అధికారులు చెబుతున్నా ఆ దిశగా కొనసాగడంలేదు. పెడస్ట్రియన్లు రోడ్లు దాటే చోట 60 శాతం సిగ్నల్స్​పనిచేయడం లేదు. మెహిదీపట్నం, జీపీవో, అమీర్ పేట్, మూసాపేట్, కూకట్ పల్లి, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్​పోలీసులు కంట్రోల్ చేయకపోతే అరగంట అయినా కూడా రోడ్డు దాటలేని పరిస్థితి ఉంది. ఆటోమెటిక్​ సిగ్నల్స్​అంటున్నా ఎక్కడ వెయిటింగ్ టైమ్ కనపడ్తలేదు. దీంతో ఎంత సేపైనా వెహికల్​ఇంజన్లను ఆన్​లోనే ఉంచి వెయిట్ చేయాల్సి వస్తుంది.