
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) హైదరాబాద్ ప్రజలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇంటి నిర్మాణం కోసం అవసరమైన నీటి లభ్యత ధృవీకరణ పత్రం (water feasibility certificate) కోసం ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.
గతంలో ఈ వెరిఫికేషన్ కోసం HMWSSB ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు HMWSSB మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌తో కలిసి ఈ ఆన్‌లైన్ సర్వీస్ ప్రారంభించారు. ఈ కొత్త సర్వీస్ HMWSSB అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
అప్లయ్ చేసుకోవడం ఎలా అంటే : ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా ముందుగా HMWSSB వెబ్‌సైట్‌లోకి వెళ్లి apply online for water feasibility certificate అనే లింక్ పై క్లిక్ చేయాలి.
ప్రాసెసింగ్ ఫీజు: దరఖాస్తు సమయంలో రూ.5వేలు ప్రాసెసింగ్ ఫీజు కట్టాలి. ఈ పేమెంట్ ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్ లైన్లో చేయవచ్చు.
స్థల పరిశీలన : దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫైల్ నంబర్ కేటాయిస్తారు. ఆ తర్వాత అధికారులు స్థలాన్ని పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తారు.
ఆమోదం: చీఫ్ జనరల్ మేనేజర్ (CGM)తో సహా ఒక కమిటీ వారానికి ఒకసారి ఈ దరఖాస్తులను పరిశీలించి ఆమోదిస్తుంది.
ధృవీకరణ పత్రం: దరఖాస్తు ఆమోదం చేసిన తర్వాత, కనెక్షన్ ఛార్జీల గురించి దరఖాస్తుదారునికి SMS ద్వారా తెలియజేస్తారు. ఈ ఛార్జీలు కట్టిన తర్వాత CGM డిజిటల్ సంతకంతో water feasibility certificate ఆన్‌లైన్‌లో పొందవచ్చు.
ఆదాయం పెంచేలా ప్రయత్నాలు: ఇకపై సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడానికి కూడా ప్లాన్స్ రెడీ చేస్తుంది. దీనిలో భాగంగా ఇంటి కనెక్షన్ల కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించి వాటికి సరైన బిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల సంస్థ ఆదాయం పెరిగి ప్రజలకు మరింత మెరుగైన నీరు ఇంకా మురుగునీటి సేవలు అందించడానికి వీలవుతుంది.
అలాగే వీటిని కూడా ప్రతిపాదించారు:
*నీటి నాణ్యత, పైప్‌లైన్లు, మీటర్ల నాణ్యతను బట్టి లిస్ట్ తయారి.
*మీటర్లు లేని కనెక్షన్లకు బిల్లింగ్ పద్ధతులను మెరుగుపరచడం.
*పెండింగ్‌లో ఉన్న బిల్లులను వసూలు చేయడం.
*మీటర్ రీడింగ్ ఏజెన్సీలకు కొత్తగా టెండర్లు పిలవడం.